నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు, ఈ స్టాక్స్ మాత్రం 15% జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఫిబ్రవరి 4, 2022) నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత ఆద్యంతం నష్టాల్లోనే ఊగిసలాట మధ్య చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బడ్జెట్ నేపథ్యంలో వరుసగా మూడు రోజుల పాటు భారీగా లాభపడిన స్టాక్స్ నిన్నటి నుండి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది.

రోజంతా నష్టాల్లో
సెన్సెక్స్ ఉదయం 58,918 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,943 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,446 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17590 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17617 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,462 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 143 పాయింట్లు క్షీణించి 58,644 పాయింట్ల వద్ద, నిఫ్టీ 43.90 పాయింట్లు నష్టపోయి 17,516 పాయింట్ల వద్ద ముగిసింది.

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు
అంతర్జాతీయ మార్కెట్ నుండి ప్రతికూల సంకేతాలు రావడంతో సూచీలు నష్టాల్లో కొనసాగి, అలాగే ముగిశాయి. ముఖ్యంగా అమెరికాలో టెక్ రంగంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మెటాగా మారిన ఫేస్‌బుక్ షేర్ల పతనం వరుసగా రెండో రోజు కొనసాగింది. గురువారం కంపెనీ షేర్లు ఏకంగా 26 శాతం నష్టపోయాయి. అమెరికాలో ప్రధాన సూచీల్లో ఒకటైన నాస్‌డాక్ నిన్న నాలుగు శాతం పతనమైంది. ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. మరోవైపు వచ్చేవారం జరగబోయే ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ఈసారి రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ స్టాక్స్ జంప్
నేడు మార్కెట్లు నష్టాల్లో ముగిసినప్పటికీ, పలు స్టాక్స్ 15 శాతం మేర లాభపడ్డాయి. ఓరియెంట్ అబ్రాసివ్(20.0%), స్టార్‌లైన్ ప్రిసీయస్ (19.97%), క్లారా ఇండస్ట్రీస్ (19.13%), నాహర్ క్యాపిటల్ (18.72%), అంబికా కాటన్ (18.56%), నాహర్ పాలీ ఫిల్మ్(16.67%), మాస్ ఇన్ సర్వీసెస్ (16.5%) లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications