ఈ వారం స్టాక్ మార్కెట్, బంగారం ఎలా ఉండవచ్చు?
స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్ ఈ వారం కూడా ఊగిసలాటలో కొనసాగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతవారం మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇటీవల లాభాల నేపథ్యంలో గతవారం ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడంతో పాటు అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపాయి. సెన్సెక్స్ గతవారం చివరి సెషన్లో 233 పాయింట్లు క్షీణించి 57,362 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 17,153 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక పసిడి మార్కెట్ క్షీణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

మార్కెట్ పైన వీటి ప్రభావం
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా సూచీలు పైకి, కిందకు కదలాడవచ్చునని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కమోడిటీ ద్రవ్యోల్భణం పెరుగుతోందని, దీంతో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు దూరంగా ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. మార్చి 31వ తేదీతో డెరివేటివ్ కాంట్రాక్ట్స్ నెల వారీ గడువు కూడా పూర్తి కానుండటం కూడా మార్కెట్లలో ఊగిసలాటకు ఆస్కారం ఉందంటున్నారు. నిఫ్టీ 17000 పాయింట్లకు పైనే కొనసాగితే 17500 దాటవచ్చునని, క్షీణిస్తే మాత్రం 16500 దిగువకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇవి సానుకూలం
సిమెంట్ ధరల పెరుగుదల ఇక ముందు ఉండదనే వార్తల నేపథ్యంలో ఈ స్టాక్స్ స్థిరంగా కొనసాగవచ్చు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలకు తోడు, రష్యా నుండి మన దిగుమతుల డెవలప్‌మెంట్ పైన పెట్రో స్టాక్స్ ఆధారపడి ఉంటాయి. కమోడిటీ ధరలు అధికం కారణంగా ఎఫ్ఎంసీజీ షేర్లు ఈసారి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఐటీ, సిమెంట్ షేర్లకు మాత్రం కాస్త సానుకూలంగా ఉన్నాయి.

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు
గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.52,300 సమీపంలో నిరోధకం ఎదురు కావొచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే మాత్రం రూ.52,750కి చేరుకుంటుందని, తగ్గితే మాత్రం రూ.51,350 దిగువకు వస్తుందని అంచనా వేస్తున్నారు. వెండి ఫ్యూచర్ రూ.68,000 దిగువకు వస్తే మరింత తగ్గి రూ.66,600 స్థాయి కిందకు పడిపోవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications