EMI మిస్ అయితే ఇంతలా వేధింపులా.. రోజుకు 300 కాల్స్.. రికవరీ ఏజెంట్ల బెదిరింపులపై షాకింగ్ వివరాలు..
Loan Recovery Harassment: దేశీయంగా గృహ రుణాలు త్వరితగతిన పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ఆర్థిక స్థిరత్వ నివేదికల ప్రకారం.. గృహ రుణాలు దేశ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 45.5 శాతానికి చేరుకున్నాయి. బ్యాంకు రుణాలు పొందడం ఎంత సులభతరమైందో, అనుకోని పరిస్థితుల్లో తిరిగి చెల్లించలేని సమయంలో తలెత్తుతున్న సమస్యలు అంతే తీవ్రంగా మారాయి. కుటుంబంలో అకస్మాత్తుగా ఉద్యోగం పోవడం, రాబడి తగ్గడం లేదా అనారోగ్య అత్యవసర ఖర్చులు వంటివి ఎదురైనప్పుడు చాలామంది ఈఎంఐలు చెల్లించలేక అప్పుల సుడిగుండంలో పడిపోతున్నారు.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో రుణగ్రహీతలకు సహాయం అందించాల్సిన వ్యవస్థకు భిన్నంగా.. రికవరీ ఏజెంట్ల ఆగడాలు వారిని మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. బ్యాంకులు, నియంత్రిత రికవరీ సంస్థలు థర్డ్-పార్టీ ఏజెంట్లను నియమించుకోవడంలో చూపించే శ్రద్ధ, వారిని క్రమబద్ధీకరించడంలో చూపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

రుణాల వసూలు ప్రక్రియలో మానవ హక్కులు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు విధించింది. రికవరీ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణగ్రహీతలను శారీరకంగా గానీ, మాటలతో గానీ వేధించకూడదు. ఫోన్ కాల్స్ మాట్లాడటానికి నిర్దిష్ట సమయాలు మాత్రమే అనుమతించబడతాయి. రుణగ్రహీత అనుమతి లేకుండా వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా ఆఫీసు బాస్‌లకు ఫోన్ చేసి అవమానించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఈ నిబంధనలు ఏజెంట్లు ఉల్లంఘిస్తే.. దానికి పూర్తి బాధ్యత సదరు బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలే వహించాల్సి ఉంటుంది.
అయితే వాస్తవ పరిస్థితి వీటికి పూర్తిగా భిన్నంగా ఉంది. రుణ పరిష్కార సంస్థలకు అందుతున్న ఫిర్యాదుల విశ్లేషణ ప్రకారం.. రికవరీ ఏజెంట్ల ప్రవర్తన బాధితుల జీవితాలను ఎంతటి సంక్షోభంలోకి నెడుతుందో స్పష్టమవుతోంది. రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ప్రధాన వేధింపులను గమనిస్తే.. అత్యధికంగా 42 శాతం మంది నిరంతరంగా వచ్చే అనామక, బెదిరింపు ఫోన్ కాల్స్ వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
అలాగే 38 శాతం మంది తమను భయపెట్టే భాషను ఏజెంట్లు ఉపయోగిస్తున్నారని, 32 శాతం మంది నేరుగా ఇళ్ళు లేదా ఉద్యోగ ప్రాంతాలకు వచ్చి గొడవలు చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా, 27 శాతం మంది తీవ్రమైన దుర్భాషల బారిన పడగా.. 11 శాతం మంది బంధువులు, బాస్‌లకు ఫోన్లు చేసి సామాజికంగా ప్రతిష్టను దెబ్బతీసే చర్యలను ఎదుర్కొన్నారు.
అప్పుల ఊబిలోకి నెడుతున్న ప్రధాన కారణాలు:
రుణగ్రహీతలు ఎందుకు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారు అనే అంశంపై లోతైన అధ్యయనం చేస్తే కొన్ని కీలక విషయాలు బయటపడతాయి.
1. ఉద్యోగం కోల్పోవడం లేదా ఆదాయంలో కోత (31 శాతం): స్థిరమైన రాబడి ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల మిగిలిన ఆదాతో ఈఎంఐలు చెల్లించడం అసాధ్యంగా మారుతుంది.
2. అధిక ఈఎంఐ భారం (28 శాతం): నెలవారీ ఆదాయానికి మించిన రుణ విడతలను అంగీకరించడం వల్ల నిత్య జీవిత ఖర్చులకు డబ్బులు చాలక రుణగ్రస్తులవుతున్నారు.
3. బహుళ రుణాలు మరియు క్రెడిట్ కార్డుల ఉచ్చు (19 శాతం): ఒక అప్పు తీర్చడానికి మరొక బ్యాంకులో క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా పర్సనల్ లోన్ ద్వారా అప్పులు చేయడం వల్ల ఇవి కొండలా పేరుకుపోతున్నాయి.
4. కుటుంబ అత్యవసర వైద్య ఖర్చులు (12 శాతం): అనారోగ్య సమస్యలకు అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు ఖర్చు కావడం వల్ల ముందస్తు ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటున్నాయి.
5. వ్యాపార లోటు లేదా నష్టాలు (7 శాతం): చిన్న తరహా వ్యాపారాల్లో నష్టాలు రావడం లేదా రాబడాల్సిన నిధులు సమయానికి అందకపోవడం.
నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు:
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సంపాదన ప్రారంభించిన కొత్తలోనే అత్యవసర నిధిని సిద్ధం చేసుకోకపోవడం చాలామంది చేస్తున్న ప్రధాన పొరపాటు. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ రుణాల వంటి అసురక్షిత అప్పులు (Unsecured Loans) పరిమితికి మించి తీసుకున్నప్పుడు చిన్న ఆర్థిక సమస్య వచ్చినా అది వ్యవస్థనే దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితి నుండి బయటపడటానికి భయాందోళనలకు గురికాకుండా ఉండటం ప్రాథమిక సూత్రం.
రికవరీ ఏజెంట్లు పరిమితి దాటి వేధిస్తే.. ఆ వివరాలను రికార్డు చేసి బ్యాంకు ఒంబడ్స్‌మన్‌కు లేదా పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు రుణగ్రహీతలకు ఉంది. అలాగే తీవ్రమైన రుణ భారం ఉన్నప్పుడు చట్టబద్ధమైన రుణ పరిష్కార సంస్థలు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ల సహాయంతో బ్యాంకర్లతో ముఖాముఖి చర్చలు జరిపి సమయం పొడిగింపు పొందడం లేదా ఏకకాల పరిష్కారానికి (One-Time Settlement) ప్రయత్నించడం సురక్షితమైన మార్గం. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కనీసం 6 నెలల ఈఎంఐలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్‌ను దాచుకోవడం వల్ల ఇటువంటి సంక్షోభాల నుండి రక్షణ పొందే వీలుంటుంది.


Click it and Unblock the Notifications
