మ్యూచువల్ ఫండ్స్‌పై లోన్ తీసుకోవచ్చని తెలుసా? పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ.. ప్రాసెస్ ఎలాగంటే..
సాధారణంగా మనం అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ముందుగా చేసే పని.. మన దగ్గరున్న పొదుపు మొత్తాలను వెనక్కి తీసుకోవడం లేదా పెట్టుబడులను అమ్మేయడం. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) లో ఇన్వెస్ట్ చేసే వారు.. డబ్బు అవసరమైతే ఆ యూనిట్లను రిడీమ్ (అమ్మేయడం) చేసుకుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు దెబ్బతింటాయి. అలా కాకుండా మీ ఫండ్లను అమ్మకుండానే వాటిపై రుణం పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? అదే 'లోన్ ఎగైనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్' (LAMF).

ఈ రుణం ఎలా పనిచేస్తుంది?
మీ వద్ద ఉన్న ఈక్విటీ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను బ్యాంకు లేదా NBFC (Non-Banking Financial Company) వద్ద హామీగా (Collateral) ఉంచి మీరు రుణం తీసుకోవచ్చు. దీనివల్ల మీ పెట్టుబడులు అలాగే ఉంటాయి. మార్కెట్ పెరిగితే వచ్చే లాభాలు మీకే వస్తాయి. అదనంగా మీరు లోన్ కూడా పొందొచ్చు.
ఎంత రుణం లభిస్తుంది? (LTV Ratio)
మీ ఫండ్ విలువను బట్టి బ్యాంకులు రుణం ఇస్తాయి. అయితే ఫండ్ రకాన్ని బట్టి ఈ శాతం మారుతుంది..
- ఈక్విటీ ఫండ్స్ (Equity Funds): వీటిపై సాధారణంగా ఫండ్ విలువలో 50% వరకు రుణం లభిస్తుంది. షేర్ మార్కెట్ అస్థిరత వల్ల వీటికి పరిమితి తక్కువగా ఉంటుంది.
- డెట్ ఫండ్స్ (Debt Funds): వీటిలో రిస్క్ తక్కువ. కాబట్టి ఫండ్ విలువలో 80% నుంచి 85% వరకు రుణం పొందవచ్చు.
ఉదాహరణకు మీ ఈక్విటీ ఫండ్స్ విలువ రూ. 20 లక్షలు ఉంటే.. మీరు రూ.10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
వడ్డీ రేట్లు.. ప్రయోజనాలు..
మ్యూచువల్ ఫండ్లపై ఇచ్చే రుణాలు 'సెక్యూర్డ్ లోన్స్' కిందకు వస్తాయి. అందుకే వీటి వడ్డీ రేట్లు పర్సనల్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్ లోన్స్ కంటే తక్కువగా ఉంటాయి.
- తక్కువ వడ్డీ: సాధారణంగా ఏడాదికి 8% నుంచి 12% మధ్య వడ్డీ ఉంటుంది.
- ప్రాసెసింగ్ స్పీడ్: ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేస్తే 24 గంటల్లోనే నగదు మీ ఖాతాలో జమవుతుంది.
- పెట్టుబడి కొనసాగుతుంది: మీరు లోన్ తీసుకున్నప్పటికీ మీరు మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) మార్కెట్లో యాక్టివ్‌గానే ఉంటాయి. డివిడెండ్లు లేదా వృద్ధి (Growth) లాభాలు మీకే చెందుతాయి.
- క్రెడిట్ స్కోర్: ఇక్కడ ఫండ్లు గ్యారెంటీగా ఉంటాయి. కాబట్టి సిబిల్ స్కోర్ కొంచెం తక్కువగా ఉన్నా రుణం లభించే అవకాశం ఉంది.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు (Terms & Conditions)
ఇకపోతే ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మీరు లోన్ తీసుకున్నప్పుడు, ఆ యూనిట్లపై బ్యాంకుకు 'లీన్' (Lien) అధికారం ఉంటుంది. అంటే రుణం తీరే వరకు మీరు ఆ ఫండ్లను అమ్మలేరు. ఒకవేళ మీరు రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే.. బ్యాంకు మీ యూనిట్లను అమ్మి తన బాకీని వసూలు చేసుకుంటుంది. ఒకవేళ మార్కెట్ భారీగా పడిపోయి మీ ఫండ్ విలువ తగ్గితే.. బ్యాంకు మిమ్మల్ని అదనపు మార్జిన్ డబ్బు కట్టమని లేదా మరికొన్ని యూనిట్లను తాకట్టు పెట్టమని అడగవచ్చు.
ఎవరికి ఇది ఉపయోగకరం?
పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు లేదా వ్యాపార విస్తరణ వంటి అత్యవసర అవసరాలకు ఇది ఒక అద్భుతమైన మార్గం. మీ ఆస్తులను (Assets) అమ్ముకోకుండానే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) పై రుణం తీసుకోవడం తెలివైన పని.
మొత్తంగా మీ పెట్టుబడులను కాపాడుకుంటూనే నగదు అవసరాలను తీర్చుకోవడానికి ఈ లోన్ సదుపాయాన్ని వినియోగించుకోండి. అయితే తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ ప్రొఫైల్ పాడవ్వకుండా చూసుకోవడం ముఖ్యం.


Click it and Unblock the Notifications