లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) త్వరలో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్ఐసీలో వాటాదారులుగా మారడానికి అవకాశం ఉంది. రాయితీలో షేర్లను దక్కించుకోవడానికి రిటైల్ విభాగంలో తన పాలసీదారుల కోసం ఎల్ఐసీ ప్రత్యేకంగా షేర్లను జారీ చేయనుంది. ఇందుకు ఇష్యూ పరిమాణంలో పది శాతం షేర్లను కేటాయిస్తోంది. వీటికి షేర్ ధరలో రాయితీ కూడా ఉండనుంది. ఈ రాయితీ పది శాతం వరకు ఉంటుందని భావిస్తున్నప్పటికీ, స్పష్టంగా మాత్రం తెలియరాలేదు. ఎల్ఐసీ ఐపీవో కోసం దేశంలోని కోట్లాదిమంది ఇన్వెస్టర్లు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

గ్రూప్ పాలసీదారులకు నో
ఎంతోమంది పాలసీదారులు ఐపీవోలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ అందరికీ రాయితీతో కూడిన షేర్లను పొందే అవకాశం లేదు. కొంతమంది పాలసీదారులకు మాత్రమే ఈ సంస్థ అవకాశం కల్పిస్తోంది. రాయితీతో కూడిన షేర్ల కోసం బిడ్ దాఖలు చేయడానికి కొంతమందికి అర్హత లేదు. అందులో గ్రూప్ పాలసీదారులు కూడా ఉన్నారు. గ్రూప్ పాలసీదారులు మినహా దాదాపు మిగతా పాలసీదారులు అందరు కూడా పాలసీదారు రాయితీ కింద ఐపీవో కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ పాలసీ కాకుండా ఇతర ఏ పాలసీలో సభ్యుత్వం ఉన్నా రాయితీతో కూడిన షేర్లకు బిడ్ దాఖలు చేయవచ్చు.

డీమ్యాట్ ఖాతా వేరుగా ఉండాలి
దంపతులిద్దరికీ కలిపి ఒకే డీమ్యాట్ ఖాతా ఉంటే వారు రాయితీతో కూడిన షేర్లకు బిడ్ దాఖలు చేయలేరు. సెబి ఐసీఆర్డీ నిబంధనల ప్రకారం ఒక డీమ్యాట్ ఖాతా నుండి ఇధ్దరు లబ్ధిదారులు ఐపీవోకు దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. ప్రాథమిక ఖాతాదారు మాత్రమే ఇష్యూలో పాల్గొనాలి.
ప్రస్తుతం యాన్యుటీ పొందుతున్న యాన్యుటీ పాలసీదారుడి జీవిత భాగస్వామి ఐపీవోలో పాల్గొనలేరు. పాలసీదారు కచ్చితంగా వ్యక్తిగత డీమ్యాట్ ఖాతా నుండి ఐపీవోలో పాల్గొనాలి. కుటుంబ సభ్యుల ఖాతా అంటూ పాల్గొనలేరు.
ఎన్నారై పాలసీదారులు రాయితీతో కూడిన షేర్ల కోసం దరఖాస్తు చేసుకోలేరు. భారత్‌లో ఉంటున్నవారికి మాత్రమే రాయితీ ఉంది.
నామినీ వ్యక్తులకు రాయితీ వర్తించదు.
పాలసీదారులు కాకుండా ఇతరులు రిటైల్ ఇన్వెస్టర్ లేదా నాన్-ఇనిస్టిట్యూషనల్ బిడ్డర్ కింద ఐపీవో కోసం దరఖాస్తు చేయవచ్చు. కానీ వీరికి రాయితీ వర్తించదు.

ఇవి తప్పనిసరిగా చేయండి
ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనడానికి పాన్ నెంబర్‌ను ఎల్ఐసీ పాలసీకి జత చేయాలి. పాలసీకి ఆధార్ నెంబర్‌ను కూడా జత చేయడం ద్వారా ఎల్ఐసీ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా వివిధ రకాల ట్రాన్సాక్షన్స్ నిర్వహించవచ్చు.
పాన్ నెంబర్ నమోదు చేయడానికి మొదట ఎల్ఐసీ వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. పాన్ రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేసి, అక్కడి సమాచారాన్ని చదివి, వివరాలు నమోదు చేయాలి. ఓటీపీ ద్వారా వాటిని ధృవీకరించాలి. ఆ తర్వాత మీ పాలసీ-పాన్ అనుసంధానం అయిందా లేదా చూసుకోవడానికి వెబ్ సైట్‌లోకి వెళ్లి మీ పాలసీ సంఖ్య ఆధారంగా ఆన్ లైన్ యూజర్ ఖాతాను సృష్టించుకోవాలి. దీంతో మీ పని సులువు అవుతుంది.
ఐపీవోలో పాల్గొనడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. పాన్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు.. వీటితో డీమ్యాట్ ఖాతా తీసుకోవడం సులభం. మీకు డీమ్యాట్ ఖాతా లేకపోతే చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా ఓ స్టాక్ బ్రోకర్ ద్వారా వీలైనంత త్వరగా తీసుకోవాలి.


Click it and Unblock the Notifications