e-Insurance: ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఇన్సూరెన్స్ పాలసీ.. IRDAI కొత్త రూల్స్ ప్రయోజనాలివే..
Insurance News: కరోనా తర్వాత చాలా మందిలో ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి అవసగాహన పెరిగింది. దీంతో తమ అవసరాలకు అనుగుణంగా చాలా మంది బీమా పాలసీలను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి వచ్చాయి.
వివరాల్లోకి వెళితే.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDA) ఏప్రిల్ 1 నుంచి బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఉంచడం తప్పనిసరి చేసింది. దీని కోసం బీమా చేసిన వ్యక్తి ఇ-ఇన్సూరెన్స్ ఖాతా(EIA) తెరవవలసి ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల బీమా పాలసీలను డిజిటల్ రూపంలో సేవ్ చేయవచ్చు. దీని తర్వాత పేపర్ పాలసీ అవసరం ముగుస్తుంది. ఇ-ఇన్సూరెన్స్ ఖాతాల నిర్వహణకు CAMS ఇన్సూరెన్స్ రిపోజిటరీ, కార్వీ, NSDL డేటాబేస్ మేనేజ్‌మెంట్(NDML), సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపోజిటరీ ఆఫ్ ఇండియాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడింది. వినియోగాదారులు వీటిలో ఏదో ఒకదాని నుంచి సేవలను పొందవచ్చు. దరఖాస్తు చేసిన వారం రోజుల్లోనే ఇ-ఇన్సూరెన్స్ ఖాతా తెరవబడుతుంది.

ఇ-ఇన్సూరెన్స్ ఖాతా తెరిచేందుకు పాస్పోర్ట్ సైజు ఫోటో, పాన్ కార్డ్, గుర్తింపు రుజువు, పుట్టిన తేదీ రుజువు, చిరునామా సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అవసరం ఉంటుంది. ఇ-ఇన్సూరెన్స్ ఖాతా ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది అంటే బీమా చేసినవారు మాత్రమే దానిని ఉపయోగించగలరు. ఇతరులకు దీని యాక్సిస్ ఉండదు. పాలసీకి సంబంధించిన వివరాలను ఇక్కడి నుంచే ట్రాక్ చేయవచ్చు. పైగా వీటికి సంబంధించిన నామినీ వివరాలను సైతం ముందుగానే జోడించాల్సి ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో అవసరమైనప్పుడు నామినీ ఈ ఖాతాను యాక్సెస్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.
ఇప్పటికే ఉన్న పాత పాలసీలను డిజిటల్ రూపంలోకి మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇందులో పాలసీదారు పేరు, పాలసీ నంబర్, ఈ-ఇన్సూరెన్స్ ఖాతా నంబర్, బీమా కంపెనీ పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది ఇ-ఇన్సూరెన్స్ ఫారమ్‌తో పాటు కంపెనీ శాఖకు సమర్పించాలి. మార్చిన వెంటనే పాలసీదారు దాని గురించి SMS, ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని పొందుతారు. ఇలా చేయటం వల్ల పాలసీదారులు తమ ఇన్సూరెన్స్ వివరాలను ఒకే చోటు పొందుతూ ట్రాక్ చేసుకోవటం సులువవుతుంది. ఆన్‌లైన్ మోసం నుండి రక్షణ కల్పించబడుతుంది. బీమా ఖాతాను ఎక్కడి నుండైనా ఆపరేట్ చేయవచ్చు. అలాగే డాక్యుమెంట్స్ మిస్ అవుతాయనే ఆందోళన ఇక అస్సలు ఉండదు.


Click it and Unblock the Notifications