Fixed Deposits: మూడేళ్లకు FD చేసేందుకు బెస్ట్ బ్యాంక్స్.. ఎంత వడ్డీ ఇస్తున్నాయంటే..
Fixed Deposits: ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా అనేక మంది తమ డబ్బును సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకులను ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల విషయంలో వెనక్కు నెట్టాయి. ముందుగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల కాలానికి చేసే డిపాజిట్లపై 8.6 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అంటే లక్ష దాచుకుంటే అది రూ.1.29 లక్షలుగా మారుతుంది. దీని తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8 శాతం వడ్డీని అందిస్తుండగా లక్ష పెట్టుబడి రూ.1.27 లక్షలుగా మారుతోంది.

ఇక విదేశీ బ్యాంక్ డ్యుయిష్ మూడేళ్ల కాలానికి చేసే డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. దీనికింద లక్ష దాచుకున్న వారు మూడేళ్ల తర్వాత రూ.1.26 లక్షలు అందుకుంటారు. ప్రైవేటు రంగంలోని డీసీబీ బ్యాంక్ మూడేళ్ల FDలపై అత్యధికంగా 7.60 శాతం వడ్డీని అందిస్తోంది. దీని తర్వాత ప్రైవేటు బ్యాంకింగ్ రంగానికి చెందిన బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంకులు మూడేళ్ల డిపాజిట్లకు గరిష్ఠంగా 7.26 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
ఇక చివరగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల FDలపై 7.20 శాతం వడ్డీని అందిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చిన్న ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కొత్త డిపాజిట్లను పొందేందుకు అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ కింద ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులకు హామీని అందిస్తోంది. కాబట్టి రూ.5 లక్షల వరకు మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు కాబట్టి సురక్షితంగా దాచుకోవచ్చు.


Click it and Unblock the Notifications