వివాహాలకు టాటా ఏఐఏ సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. Shubh Muhurat స్కీమ్ ప్రయోజనాలివే
Tata AIA Shubh Muhurat: భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు ఉంది. వివాహం చేయటం సమాజంలో ఒక పెద్ద పండుగ. దానిని ఎంత అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారనే విషయం కూడా చాలా ముఖ్యమైనదిగా భారతీయ కుటుంబాలు భావిస్తుంటాయి. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ శుభ ముహూరత్ పేరుతో కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ లాంచ్ చేసింది.
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 'శుభ్ ముహూరత్' అనే కొత్త జీవిత బీమా పరిష్కారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది భారతీయ కుటుంబాలను వివాహాలకు ఆర్థికంగా సిద్ధం చేసేందుకు సహాయపడుతుందని కంపెనీ వెల్లడించింది. రోజురోజుకూ పెరిగిపోతున్న వివాహ ఖర్చులను ఎదుర్కోవటానికి ప్రజలు క్రమశిక్షణతో పొదుపు చేయటం, సంపద సృష్టితో పాటు ఆర్థికంగా సిద్ధంగా మార్చటం ఈ స్కీమ్ లక్ష్యంగా తెలుస్తోంది.

భారతదేశం ప్రపంచవ్యాప్తగా రెండవ అతిపెద్ద వివాహ పరిశ్రమను కలిగి ఉంది. కేవలం 2024లో 80 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరిగాయి. జెఫరీస్ నివేదిక ప్రకారం ప్రజలు ఈ వివాహాలకు ఏకంగా రూ.10.7 లక్షల కోట్లను ఖర్చు చేశారని వెల్లడించింది. సగటున ఒక్కో పెళ్లికి కుటుంబాలు దాదాపు రూ.12.5 లక్షలు వెచ్చించాయని తేలింది. ఇది విద్య కోసం చేసిన సగటు ఖర్చు కంటే ఎక్కువ కావటం గమనార్హం.
అయితే ప్రస్తుతం పెరిగిపోతున్న పెళ్లి ఖర్చులను 31-50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన తల్లిదండ్రులు అధిగమించటం కోసం టాటా ఏఐఏ కొత్త పథకాన్ని తెచ్చింది. దీని ద్వారా తల్లిదండ్రులు 1-20 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన పిల్లల పెళ్లి కోసం ప్లాన్ చేసుకునేందుకు సహాయం చేస్తుంది. పాలసీ పెట్టుబడికి గ్యారెంటీ, మార్కెట్-లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్, ఊహించని సంఘటనల విషయంలో పొదుపులను కాపాడుకోవడానికి లైఫ్ కవర్ వంటి లక్షణాలను అందిస్తుంది. వేదిక బుకింగ్‌లు, వేడుకలు, అతిథి వసతి, ఆభరణాల కొనుగోళ్లతో సహా వివిధ వివాహ సంబంధిత ఖర్చులతో ప్రణాళికాబద్ధమైన చెల్లింపులను అందిస్తుంది.
భారతీయ కుటుంబ విధానంలో పెళ్లి అనేది ప్రతి వ్యక్తికి జీవితకాలంలో ఒక ముఖ్యమైన సంఘటన. దీనిని ప్లాన్ చేయడానికి జాగ్రత్తగా ఆర్థికంగా సిద్ధం కావాలనే ఉద్ధేశ్యంతోనే ప్లాన్ లాంచ్ చేసినట్లు టాటా ఏఐఏ లైఫ్ MD & CEO వెంకీ అయ్యర్ వ్యాఖ్యానించారు. అనుకోని పరిస్థితుల్లో పాలసీదారు మరణిస్తే.. నామినీలకు మెచ్యూరిటీ ప్రయోజనాలను స్కీమ్ అందిస్తుందని ఆయన వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దగ్గరలోని కంపెనీ శాఖను లేదా ఆన్ లైన్ లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications