ప్రపంచంలోనే వ్యక్తిగతంగా ఎక్కువగా బంగారం వినియోగించేవారు మన దేశంలో ఉంటారు. బంగారంపై పెట్టుబడులు పెట్టడం, బ్యాంకు లాకర్లలో దాచుకోవడం బాగానే పెరిగింది. బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను ఇంట్లో లేదా ఇతర ప్రాంతాల్లో పెట్టుకోవడం కంటే బ్యాంకు లాకర్లలో దాచుకోవడం సురక్షితంగా భావిస్తున్నారు. ఇంటితో పోలిస్తే బ్యాంకుల్లో దొంగతనం జరిగే అవకాశాలు సాధారణంగా చాలా తక్కువ.

లాకర్లలో పెడితే సురక్షితమా?
బ్యాంకు లాకర్లు ఎంత సురక్షితమైనప్పటికీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బ్యాంకు లాకర్లలో పెడితే బంగారు నగలు సురక్షితంగా ఉంటాయని భావిస్తారు. కానీ లాకర్‌లోని వస్తువులకు బ్యాంకులు బాధ్యత తీసుకోవనే విషయం మీకు తెలుసా? అయితే లాకర్లలో పెట్టాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

పాలసీ ఎక్కడైనా వర్తిస్తుంది
మీరు లాకర్లలో దాచుకోవాలనుకుంటే బీమా చేయాలి. అది మీకు సురక్షిత ఎంపిక. చాలా బీమా సంస్థలు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. టాటా ఏఐజీ ఇన్సురెన్స్ జ్యువెల్లరీ అధిక నికర విలువ కలిగిన వినియోగదారులకు సమగ్ర ప్యాకేజీ పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ ప్రకారం మీరు ఇంట్లో లేదా బ్యాంకు లాకర్‌లో పెట్టుకున్నా పాలసీ వర్తిస్తుంది.

ఇలా జరిగితే బీమా
IFFCO టోకియో జనరల్ ఇన్సురెన్స్ బ్యాంకు లాకర్స్ కోసం స్టాండలోన్ పాలసీని అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా మీ బంగారం దొంగిలించబడినా లేదా ఇతర మార్గాల ద్వారా బంగారం కోల్పోయినా బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ ప్రకారం బంగారు ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు బ్యాంకు లాకర్‌లో దాచిపెట్టినప్పుడు అగ్ని ప్రమాదం, భూకంపం, దొంగతనం, హోల్డప్, బ్యాంకు ఉద్యోగుల అవిశ్వాసం, యాక్ట్ ఆఫ్ గాడ్స్, యాక్ట్ ఆఫ్ టెర్రరిజం వంటి వాటిపై బీమా వర్తిస్తుంది.

రూ.300తో రూ.3 లక్షల బీమా
బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు మాత్రమే కాకుండా బ్యాంకు లాకర్‌లోని కీలక డాక్యుమెంట్లను కూడా బీమా చేయించుకోవచ్చు. డ్యామేజ్ జరిగితే రీప్లేస్‌మెంట్ ఉంటుంది. ఈ ఇన్సురెన్స్ వెబ్ సైట్ ప్రకారం రూ.300తో కనీసం రూ.3 లక్షల వరకు కవరేజ్ ఉంది. రూ.2,500కు రూ.40 లక్షల కవరేజ్ కూడా తీసుకోవచ్చు. రూ.40 లక్షలకు మించి బీమా అయితే వ్యాల్యూను బట్టి పెరుగుతుంది.

పాలసీ...
లాకర్‌లో ఉంచిన విలువైన పత్రాలు, విలువైన వస్తువులపై లాకర్ బీమా పొందడం తప్పనిసరి. సాధారణంగా ఎవరైనా భద్రత కోసం లాకర్ బీమా సూచనలు చేస్తుంటారు. ఎవరైనా లాకర్‌లో అధిక విలువైన ఆభరణాలు లేదా డాక్యుమెంట్స్ ఉంచితే అలాంటి సమయాల్లో బీమా మంచి ఎంపిక. బ్యాంక్ లాకర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమగ్రమైన పాలసీ తీసుకోవాలి.


Click it and Unblock the Notifications