ఒకప్పుడు ఐఫోన్ అంటే అదొక లగ్జరీ. కానీ, ఇప్పుడు అది సామాన్యుల చేతుల్లో కూడా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఈజీ EMI ఆప్షన్లు. చేతిలో లక్ష రూపాయలు లేకపోయినా.. నెలకు కొన్ని వేల రూపాయల వాయిదాల పద్ధతిలో ఖరీదైన ఫోన్లను కొనే వెసులుబాటు ఉండటంతో యువత దీనికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అయితే పైన కనిపించే ఈ 'ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్' వెనుక ఉన్న అసలు ఆర్థిక భారాన్ని చాలామంది గుర్తించడం లేదు.

డెట్-టు-ఇన్కమ్ రేషియో అంటే ఏమిటి?
ప్రముఖ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అభిషేక్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని నమ్ముకుని, త్వరగా విలువ పడిపోయే (Depreciating assets) వస్తువులను కొనడం ఆందోళనకరం. మీరు ఏదైనా కొత్త EMI ని మీ బడ్జెట్‌లో చేర్చుకునే ముందు మీ 'డెట్-టు-ఇన్కమ్ రేషియో'ను లెక్కించుకోవాలి. అంటే మీ మొత్తం నెలవారీ అప్పుల వాయిదాలు మీ ఆదాయంలో 40% మించకూడదు. ఒకవేళ మీరు ఇప్పటికే కారు లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా పర్సనల్ లోన్లు కడుతుంటే.. ఐఫోన్ EMI మీ ఆర్థిక స్థితిని ప్రమాదంలోకి నెట్టవచ్చు.
మీరు ఐఫోన్‌ను నిజంగా భరించగలరా?
ఉదాహరణకు మీరు రూ. 1,34,900 విలువ చేసే ఐఫోన్‌ను 12 నెలల నో-కాస్ట్ EMIలో కొన్నారనుకుందాం. నెలకు దాదాపు రూ. 11,242 కట్టాలి. మీ నికర నెలవారీ ఆదాయం రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఈ EMI మీ ఆదాయంలో కేవలం 11% మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు దీనిని సులభంగా భరించగలరు. కానీ, తక్కువ జీతం ఉన్నవారు ఈ మోజులో పడితే మాత్రం సేవింగ్స్ దెబ్బతింటాయి. మీ ఆదాయంలో కనీసం 20% పొదుపు లేదా పెట్టుబడులకు వెళ్లిన తర్వాతే ఇలాంటి ఖర్చులు చేయాలి.
ఈ రూల్స్ మీకు తెలుసా?
ఖరీదైన గ్యాడ్జెట్లు కొనే ముందు ఆర్థిక నిపుణులు రెండు ముఖ్యమైన సూత్రాలను చెబుతున్నారు:
- వన్ మంత్ రూల్ (One Month Rule): మీరు కొనాలనుకునే ఫోన్ ధర మీ ఒక నెల నికర జీతం కంటే తక్కువగా ఉండాలి.
- ట్వైస్ ఓవర్ రూల్ (Twice Over Rule): మీ ఎమర్జెన్సీ ఫండ్స్ ముట్టుకోకుండా, అప్పటికప్పుడు మీరు రెండు ఫోన్లను కొనేంత నగదు మీ దగ్గర ఉంటేనే ఆ ఫోన్ కొనడం క్షేమం.
ఇన్వెస్టర్లు చేసే పొరపాట్లు
చాలామంది EMI మొత్తాన్ని మాత్రమే చూస్తారు కానీ 'అవకాశ వ్యయాన్ని' (Opportunity Cost) మర్చిపోతారు. మీరు ఫోన్ కోసం కట్టే ఆ రూ. 11,000 నెలనెలా ఏదైనా మంచి స్టాక్ మార్కెట్ ఫండ్ లేదా SIPలో పెడితే దీర్ఘకాలంలో అది పెద్ద సంపదగా మారుతుంది. దీనితో పాటు, ప్రాసెసింగ్ ఫీజులు , అప్ ఫ్రంట్ డిస్కౌంట్లు కోల్పోవడం వంటి హిడెన్ ఖర్చులు కూడా ఉంటాయి.
అవసరమా? ఆడంబరమా?
చివరిగా చెప్పేదేంటంటే ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకూడదు. మీరు మీ వృత్తిపరమైన ఎదుగుదల కోసం లేదా నైపుణ్యాలను పెంచుకోవడానికి ఫోన్ కొంటుంటే అది పెట్టుబడిగా మారుతుంది. కానీ కేవలం సోషల్ స్టేటస్ కోసం EMI మీద ఆధారపడితే మాత్రం అది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టవచ్చు. ఏదైనా కొనేముందు మీ దగ్గర కనీసం 6 నెలల EMIలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి.
have changed meta description for better seo performance.. the article topic is now again relevant because of recent news.


Click it and Unblock the Notifications