ఏప్రిల్ 1 నుండి రూ.1 కోటి ప్రమాద బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పథకం ప్రయోజనాలెన్నో
ఆరోగ్య బీమా, సాధారణ బీమా కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రామాణిక వ్యక్తిగత బీమాపథకాన్ని తప్పనిసరిగా అందించాలని ఇన్సురెన్స్ రెగ్యులేటర్ Irdai(ఇన్సురెన్స్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్అథారిటీ ఆఫ్ ఇండియా) సూచించింది. ప్రతి ఉత్పత్తి కూడా ప్రత్యేక ఫీచర్స్ కలిగి ఉండాలని, ఈ ప్రామాణిక బీమా పథకాన్ని సరళ్ సురక్ష బీమా పేరుతో అందించాలని సూచించింది. పేరుకు ముందు బీమా కంపెనీ పేరు జోడించుకోవాలి. ఇక ఏ పేర్లు కూడా పెట్టరాదు. స్టాండర్డ్ యాక్సిడెట్ కవర్ పాలసీకి సంబంధించి గైడ్ లైన్స్ జారీ చేసింది.

కనీసం రూ.2.5 లక్షలు, గరిష్టం రూ.1 కోటి
ఈ పథకం కనీస మొత్తం బీమా ప్రయోజనం రూ.2.5 లక్షలు, గరిష్ఠ మొత్తం రూ.1 కోటి ఉండాలి.
రూ.1 కోటి అంతకంటే ఎక్కువ మొత్తాలకు కూడా బీమా కంపెనీలు ఈ పథకాన్ని జారీ చేసుకోవచ్చు. కానీ ఆ పాలసీలకూ ఇదే పేరు ఉండాలి.
బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం బారిన పడితే పాలసీ మొత్తం బీమా ప్రయోజనాన్ని అందించాలి.
ఆసుపత్రిలో చేరితే అక్కడ అయ్యే ఖర్చులు బీమా కంపెనీ చెల్లించాలి. ఈ బీమా పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ఠ వయస్సు 70.
బీమా కంపెనీ ఈ పాలసీని గ్రూప్ పాలసీ కింద అందించవచ్చు. అయితే పాలసీ పేరులో గ్రూప్ అనే పదాన్ని కలపాలి.

అందుకే ఈ పాలసీ
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు ఉన్నాయని, వీటిని ఎంచుకోవడం ప్రజలకు కష్టతరంగా మారిందని Irdai తెలిపింది. ప్రజలకు బీమా పథకం ఎంచుకోవడం సవాల్‌గా మారిన నేపథ్యంలో ఈ గందరగోళాన్ని తగ్గించేందుకు సరళ్ సురక్ష బీమాను ప్రకటించినట్లు ఆదేశాలు ఇచ్చింది.

పాలసీదారు చనిపోతే..
ప్రమాదంలో గాయపడిన పాలసీదారు చనిపోతే వంద శాతం బీమా ఉంటుంది. ప్రమాదం జరిగిన ఏడాదిలోపు కూడా ఇవే ప్రయోజనాలు ఉంటాయి. శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే పూర్తి లాభాలు ఉంటాయి. పాక్షిక వైకల్యమైతే 50 శాతం వరకు బీమా ఉంటుంది. పాలసీ పరిధిలోకి అన్ని రకాల ఆసుపత్రి ఖర్చులు వస్తాయి. మెడిసిన్స్, వైద్య పరీక్షలు, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, ఐసీయూ వంటి ఛార్జీలు ఈ పాలసీలో ఉంటాయి. బాధితులు ఉద్యోగులు అయితే కోలుకునే వరకు బీమాలో 0.2 శాతాన్ని ప్రతి వారం ఆప్షనల్ కవరేజీ కింద నష్టపరిహారంగా ఇస్తారు. పిల్లలకు అయ్యే చదువు ఖర్చుల్లోను పది శాతం వరకు ఏకకాలంలో తీసుకోవచ్చు. చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా బాధితుడి 25 ఏళ్లలోపు పిల్లలకు చదువుల ఖర్చులు భరించాలి.


Click it and Unblock the Notifications