ఈ వారం స్టాక్ మార్కెట్, బంగారం ధరలు ఎలా ఉండవచ్చు?
స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ గతవారం లాభాల్లో ముగిసింది. నిఫ్టీ, సెన్సెక్స్ సాధారణ లాభాల్లో ముగిసినప్పటికీ, బంగారం ధరలు మాత్రం భారీగా పెరిగాయి. శుక్రవారం విడుదలైన ద్రవ్యోల్భణ గణాంకాల ప్రభావం మార్కెట్ పైన ఉంటుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన రేట్ల పెంపుకు గడువు ఇవ్వనంత వరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి ఈ వారం మార్కెట్లు ఊగిసలాట ధోరణిని కనబరచవచ్చునని, అదే సమయంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు.

ఈ వారం మార్కెట్
గతవారం సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడింది. 59,000 దిగువన ప్రారంభమైన ఈ సూచీ వారాంతానికి 60,600 పాయింట్లు క్రాస్ చేసింది. తద్వారా ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లకు మరో 1600 పాయింట్ల దూరంలో నిలిచింది. నిఫ్టీ 18,102 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే ఈ వారం మార్కెట్లు ఊగిసలాటలోనే కనిపించవచ్చునని ఎక్కువ మంది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వారంలో నిఫ్టీ 18,200 - 18,350 పాయింట్ల మధ్య కదలాడవచ్చునని ఏంజెల్ వన్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ చీఫ్ ఎనలిస్ట్ సమీత్ చవాన్ అన్నారు. మద్దతు ధర 17,700 - 17,600 పాయింట్లుగా ఉండవచ్చునని, అయితే సమీప భవిష్యత్తులో మార్కెట్ భారీగా దిద్దుబాటుకు గురి కావొచ్చునని అంటున్నారు. ఇది త్వరలో జరిగే అవకాశముందన్నారు. మరింత ముందుకు సాగితే మాత్రం 18,200 - 18,350 పాయింట్లకు చేరుకోవచ్చునని అంటున్నారు.

మద్దతు ధర
వరుసగా రెండో వారం లాభపడిన సెన్సెక్స్ ప్రస్తుతం నిరోధస్థాయి అయిన 61,100 దరిదాపుల్లో ట్రేడ్ అవుతోంది. ఈ స్థాయి ఎగువన ముగిస్తేనే ప్రస్తుత రికవరీ నిలబడే అవకాశముందని చెబుతున్నారు. 59,400-59,600 శ్రేణిలో మద్దతు లభించవచ్చునని, ఈ స్థాయి కోల్పోతే దిద్దుబాటుకు ఆస్కారం ఉందని అంటున్నారు. స్వల్పకాలంలో కొన్ని షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించవచ్చునని అంటున్నారు.

బంగారం, వెండి ధరలు ఎలా ఉండవచ్చు
గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ ఈవారం రూ.49,860 కంటే పైకి చేరకుంటే మరికొంత దిద్దుబాటుకు అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.48,300 వద్ద మద్దతు లభించే అవకాశముందని, ఈ స్థాయిని కోల్పోతే రూ.47,800 వరకు దిగి రావొచ్చునని చెబుతున్నారు. ఒకవేళ రూ.49,900 కంటే పైకి వెళ్తే రూ.50,130 వరకు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,550 పైకి చేరుకుంటే ఆ తర్వాత రూ.68,350 స్థాయికి చేరుకోవచ్చునని, రూ.65,700 దిగువకు వస్తే రూ.65,050కి పడిపోతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications