FD Interest Rates: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే క్రమంలో రిజర్వు బ్యాంక్ ఇప్పటికే అనేక మారలు వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక బ్యాంకులు ఆ ప్రయోజనాలను ఫిక్స్ డ్ డిపాజిట్ పెట్టుబడిదారులకు బదిలీ చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగంలోని మరో బ్యాంక్ ఈ జాబితాలో చేరింది.

రెండు త్రైమాసికాలుగా..
గత రెండు క్వార్టర్స్ నుంచి రిజర్వు బ్యాంక్ రెపో రేట్ల పెంపు ఒకపక్క లోన్స్ తీసుకున్న వారికి భారంగా మారుతుండగా.. మరో పక్క ఎఫ్డీ ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తోంది. పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల వారు అదనపు వడ్డీ ఆదాయాన్ని పొందుతున్నారు. రేట్ల మార్పులకు అనుగుణంగా ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సైతం FDలపై చెల్లిస్తున్న వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

సెప్టెంబర్ 13 నుంచి కొత్త రేట్లు..
సవరించబడిన కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 13 నుంచి అమల్లోకి వస్తాయని IOB తెలిపింది. బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ FDలపై చెల్లిస్తున్న వడ్డీ రేటును పెంచింది. 3- 29 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30- 45 రోజుల FDలపై 3.35 శాతం వడ్డీ చెల్లించనుంది. కొత్త రేట్ల ప్రకారం.. 46- 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై 3.75 శాతం వడ్డీ రేటును పెట్టుబడిదారులు అందుకోనున్నారు.

మూడు నెలలకు మించితే..
నేషనల్ బ్యాంక్ 91- 120 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై 4.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇదే రేటు 121- 179 రోజుల వరకు ఉంటుంది. 270 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై బ్యాంక్ 4.65 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. ఏడాది నుంచి 2 సంవత్సరాల్లో మెచ్యూరయ్యే FDలపై బ్యాంక్ 5.5 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది.

బ్యాంక్ స్పెషల్ స్కీమ్..
చిన్న పొదుపు పథకాల ప్రియులకోసం.. బ్యాంక్ ప్రత్యేక FD పథకాన్ని ప్రారంభించింది. దీని మెచ్యూరిటీ కాలం 444 రోజులు. దీని కింద డిపాజిట్ చేసిన మెుత్తానికి వడ్డీ రేటు 5.65 శాతం. మీరు 2- 3 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటే 5.60 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. 1000 రోజులు మెచ్యూరిటీ వ్యవధి ఉన్న FDలపై బ్యాంక్ 6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.


Click it and Unblock the Notifications