Credit card: వద్దనుకుని పక్కన పడేసిన క్రెడిట్ కార్డ్.. మీ సిబిల్ స్కోర్‌కి ఎలా ఎసరు పెడుతుందో తెలుసా?
చాలామంది ఖర్చులు తగ్గించుకోవాలనో లేదా అనవసరంగా షాపింగ్ చేస్తున్నామనో భావించి తమ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్‌ను వాడటం మానేస్తారు. మరికొందరైతే ఏకంగా ఆ కార్డ్‌ని ముక్కలు చేసి పక్కన పడేస్తారు. కానీ, బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసినంత ఈజీగా క్రెడిట్ కార్డ్ (Credit card) వ్యవహారం ఉండదు. మీరు ఒక కార్డ్‌ని ప్లానింగ్ లేకుండా వాడటం మానేసినా లేదా క్లోజ్ చేసినా అది మీ ఆర్థిక భవిష్యత్తుపై, ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్ (CIBIL) పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఇన్-యాక్టివ్ కార్డ్ మీ స్కోర్‌ని ఎలా తగ్గిస్తుంది?
మీరు క్రెడిట్ కార్డ్‌ని ఎక్కువ కాలం వాడకుండా ఉంచితే, అది మీ స్కోర్‌కి 'సైలెంట్ కిల్లర్' లా మారుతుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..
- క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో పెరగడం: మీకు ఉదాహరణకు రెండు కార్డులు ఉండి, రెండింటి మీద కలిపి రూ. 2 లక్షల లిమిట్ ఉందనుకుందాం. ఒక కార్డ్‌ని క్లోజ్ చేస్తే మీ లిమిట్ రూ. 1 లక్షకి పడిపోతుంది. అప్పుడు మీరు చేసే చిన్న ఖర్చు కూడా మీ మొత్తం లిమిట్‌లో ఎక్కువ శాతంగా కనిపిస్తుంది. దీనివల్ల బ్యాంకులు మిమ్మల్ని 'అప్పుల మీద ఆధారపడే వ్యక్తి'గా చూస్తాయి.
- క్రెడిట్ హిస్టరీ తగ్గడం: మీరు పదేళ్ల క్రితం తీసుకున్న పాత కార్డ్‌ని క్లోజ్ చేస్తే, మీ సుదీర్ఘమైన క్రెడిట్ చరిత్ర ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతుంది. క్రెడిట్ స్కోర్ లెక్కించేటప్పుడు మీరు ఎంత కాలంగా క్రెడిట్‌ని వాడుతున్నారు అనేది చాలా ముఖ్యం.
ఆర్థికంగా మీకు కలిగే నష్టాలు ఏంటి?
- లోన్ రావడం కష్టమవుతుంది: క్రెడిట్ స్కోర్ పడిపోవడం వల్ల భవిష్యత్తులో మీరు హోమ్ లోన్ లేదా కార్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు తిరస్కరించవచ్చు లేదా ఎక్కువ వడ్డీ వసూలు చేయవచ్చు.
- యాన్యువల్ ఫీజుల భారం: మీరు కార్డ్ వాడకపోయినా, దాన్ని అధికారికంగా క్లోజ్ చేయకపోతే బ్యాంకులు ఏటా మెయింటెనెన్స్ ఫీజులు వసూలు చేస్తూనే ఉంటాయి. మీకు తెలియకుండానే ఆ బకాయిలు పెరిగిపోయి చివరకు పెద్ద తలనొప్పిగా మారుతాయి.
- లిమిట్ తగ్గింపు: ఒకవేళ మీరు కార్డ్‌ని అసలు వాడటం లేదని బ్యాంక్ గమనిస్తే, వారు మీ క్రెడిట్ లిమిట్‌ను తగ్గించే అధికారం కలిగి ఉంటారు.
- రివార్డ్ పాయింట్స్ నష్టం: కార్డ్‌లో మీరు పొందిన క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు మీరు గమనించకుండానే ఎక్స్‌పైర్ అయిపోతాయి.
మరి ఏం చేయాలి?
మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి అనుకుంటే, కార్డ్‌ను వాడటం పూర్తిగా మానేయకండి. నెలకు కనీసం ఒక చిన్న ట్రాన్సాక్షన్ (ఉదాహరణకు మొబైల్ రీఛార్జ్ లేదా పెట్రోల్) చేసి బిల్లును సకాలంలో చెల్లించండి. ఒకవేళ మీరు నిజంగానే కార్డ్ వద్దు అనుకుంటే, దాన్ని ముక్కలు చేసి పడేయకుండా, నేరుగా బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి లేదా బ్రాంచ్‌కు వెళ్లి అధికారికంగా క్లోజ్ చేయమని అడగండి.


Click it and Unblock the Notifications