సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లు పెంచిన IDFC ఫస్ట్ బ్యాంకు, ఎంతంటే?
IDFC ఫస్ట్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.1 లక్ష లోపు ఉన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 7 శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఇది ఆరు శాతంగా ఉంది. ఈ కొత్త రేటు జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఇతర ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే మూడు శాతం నాలుగు శాతం అధికం. లక్ష రూపాయలకు మించి ఉంటే మాత్రం గతంలోని వడ్డీ రేట్లు అమలవుతాయి.

బీమా పథకం
బ్యాంకు ఖాతాదారుని డిపాజిట్లు, పొదుపు ఖాతా బ్యాలెన్స్ రూ.5 లక్షల వరకు ప్రభుత్వ డిపాజిట్ గ్యారెంటీ బీమా పథకం హామీ ఉంటుంది. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు స్థిరంగా ఉండవు. బ్యాంకు ఎప్పుడైనా సవరిస్తుంది. గత ఏడాది కరోనా కారణంగా రుణ వడ్డీ రేట్లు, డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. IDFC ఫస్ట్ బ్యాంకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,500 కోట్ల వరకు ఉంటుంది. 260 బ్రాంచీలు కలిగి ఉంది. 2015లో బ్యాంకు లైసెన్స్ పొందింది. అదే ఏడాది స్టాక్ ఎక్స్చేంజీల జాబితాలో చేరింది.

IDFC ఫస్ట్ బ్యాంకు షేర్ జంప్
IDFC ఫస్ట్ బ్యాంకు షేర్ ఇటీవల జోరుమీద ఉంది. మూడో త్రైమాసికంలో రిటైల్ లోన్ వృద్ధి నేపథ్యంలో ఈ బ్యాంకు స్టాక్ నేడు దాదాపు 11 శాతం లాభపడింది. ఈ రోజు రూ.4.55 ఎగిసి రూ.45.95 వద్ద క్లోజ్ అయింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిటైల్ లోన్ వృద్ధి బాగుండటంతో 52వారాల గరిష్టానికి చేరుకుంది. IDFC ఫస్ట్ బ్యాంకు బ్యాంకులో బలమైన డిపాజిట్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

పొదుపు ఖాతాలపై పన్ను మినహాయింపు
కాగా, పొదుపు ఖాతాలపై వడ్డీ మొత్తం ఏడాదికి రూ.10,000 లోపు ఉంటే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80టీటీఏ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 80టీటీఏ ప్రకారం ఈ మినహాయింపు ఉంటుంది.


Click it and Unblock the Notifications