మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? కానీ మీ దగ్గర శాలరీ స్లిప్ లేదా? చాలా మంది ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారస్తులు లేదా చిన్న సంస్థల్లో పనిచేసే వారు శాలరీ స్లిప్ లేదని లోన్ రాదేమో అని ఆందోళన చెందుతుంటారు. నిజానికి బ్యాంకులు మీ దగ్గర శాలరీ స్లిప్ మాత్రమే చూడవు, మీరు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించగలరా లేదా అని మాత్రమే చూస్తాయి. శాలరీ స్లిప్ లేకుండా పర్సనల్ లోన్ (personal loan) ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

చాలా మందికి లోన్ అనగానే మొదట గుర్తొచ్చేది శాలరీ స్లిప్. బ్యాంకులు అడిగే మొదటి డాక్యుమెంట్ కూడా ఇదే. అయితే బ్యాంకులు మీ ఆదాయాన్ని లెక్కించడానికి శాలరీ స్లిప్‌కు ప్రత్యామ్నాయంగా మరికొన్ని ఆధారాలను అడుగుతాయి. అవేంటంటే..
బ్యాంక్ స్టేట్‌మెంటే మీ బలం
మీ దగ్గర శాలరీ స్లిప్ లేనప్పుడు.. బ్యాంకు మేనేజర్ మీ గత 6 నుండి 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను నిశితంగా పరిశీలిస్తారు. మీ ఖాతాలోకి క్రమంగా డబ్బులు డిపాజిట్ అవుతున్నాయా? మీరు నెలానెలా కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? అనేది వారు చూస్తారు. మీరు ఫ్రీలాన్సర్ అయితే క్లయింట్ల నుంచి వచ్చే పేమెంట్లు మీ బ్యాంక్ ఖాతాలో కనిపిస్తే, అదే మీ ఆదాయానికి నిదర్శనంగా మారుతుంది. ఆదాయం ఎంత వస్తోంది అనే దానికంటే, అది ఎంత క్రమబద్ధంగా (regularity) వస్తోంది అనేది ముఖ్యం.
ఐటీ రిటర్న్స్ (ITR) ఒక వజ్రాయుధం
చాలా మంది శాలరీ స్లిప్ లేని వారు చేసే పొరపాటు ఏమిటంటే.. ఆదాయం బాగున్నా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయకపోవడం. గత రెండు లేదా మూడేళ్ల ఐటీ రిటర్న్స్ మీ దగ్గర ఉంటే అవి శాలరీ స్లిప్‌తో సమానం. మీరు ఎంత సంపాదిస్తున్నారో ప్రభుత్వానికి చెప్పిన రికార్డు. కాబట్టి బ్యాంకులు వీటిని నమ్మి మీకు వెంటనే లోన్ మంజూరు చేస్తాయి.
వ్యాపార రికార్డులు , ఇతర ఆధారాలు
మీరు చిన్న వ్యాపారం నిర్వహిస్తుంటే GST ఫైలింగ్స్, ఇన్‌వాయిస్లు లేదా వ్యాపార లైసెన్స్ కాపీలు సమర్పించవచ్చు. డాక్టర్లు, ఆర్కిటెక్టులు వంటి ప్రొఫెషనల్స్ తమ క్లయింట్ ఒప్పంద పత్రాలను చూపవచ్చు. ఇవేవీ లేని పక్షంలో, మీ దగ్గర ఉన్న బంగారం లేదా ఆస్తిని పూచీకత్తుగా ఉంచి 'సెక్యూర్డ్ లోన్' కూడా తీసుకోవచ్చు. దీనివల్ల డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ కీలకం
ఆదాయ పత్రాలు తక్కువగా ఉన్నప్పుడు, మీ 'క్రెడిట్ స్కోర్' (CIBIL) మీకు రక్షణగా నిలుస్తుంది. గతంలో మీరు తీసుకున్న లోన్లు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించి ఉంటే.. బ్యాంకులకు మీపై నమ్మకం పెరుగుతుంది. ఆదాయం ఉన్నా క్రెడిట్ స్కోర్ బాలేకపోతే లోన్ రావడం కష్టం, కానీ మంచి స్కోర్ ఉంటే శాలరీ స్లిప్ లేకపోయినా బ్యాంకులు మీ అభ్యర్థనను పరిశీలిస్తాయి.
మొత్తంగా చూస్తే.. శాలరీ స్లిప్ లేకపోవడం అనేది లోన్ రావడానికి అడ్డంకి కాదు. అయితే మీ ఆదాయానికి సంబంధించిన 'ఆధారం' (financial trail) బ్యాంకుకు కనిపించాలి. నగదు రూపంలో కాకుండా.. మీ ఆదాయాన్ని ఎప్పుడూ బ్యాంక్ ఖాతా ద్వారానే స్వీకరించే అలవాటు చేసుకోండి. దీనితో పాటు ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే, మీరు ఎప్పుడు కావాలన్నా పర్సనల్ లోన్ (personal loan) సులభంగా పొందవచ్చు.


Click it and Unblock the Notifications