how to earn 1 crore: రూ. కోటి సంపాదించడానికి బెస్ట్ స్కీమ్ ఇదే? ప్రతినెలా ఇలా చేస్తే చాలు!
కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలామంది మధ్య తరగతి వాళ్లకు ఒక అందని ద్రాక్ష వంటిది. కానీ, సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రూ.కోటి కలను ఈజీగా నిజం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే దానికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? కోటి రూపాయల కలను నిజం చేసుకోవడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.కోటి సంపాదించడం సాధ్యమే. అయితే మీ డబ్బును ఎక్కడ పెడుతున్నారు అనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి మిమ్మల్ని కచ్చితంగా కోటీశ్వరులను చేస్తుంది. అయితే, ఎంత త్వరగా అనేది మీరు ఎంత రిస్క్ తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంత పెట్టుబడి పెడతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నెలవారీ పెట్టుబడితో రూ. కోటి సంపాదించడానికి ఏయే మార్గాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
పీపీఎఫ్ (PPF)
పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ద్వారా (PPF) నెలకు రూ.25 వేలు జమ చేస్తూ 17 ఏళ్లలో రూ. కోటి సంపాదించొచ్చు. ఇందులో వడ్డీ రేటు 7.1% ఉంటుంది. అయితే ఇందులో చిన్న మెలిక ఉంది. పీపీఎఫ్‌లో ఒక వ్యక్తి సంవత్సరానికి రూ.1.5 లక్షలకు మించి పెట్టుబడి పెట్టడానికి వీలు లేదు. అంటే నెలకు ₹12,500 మాత్రమే పెట్టాలి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నెలకు చెరో రూ.12,500 పెట్టుబడి పెడితే 17 ఏళ్లలో రూ. కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
పీఎఫ్ (Provident Fund)
ఇందులో వడ్డీ రేటు 8.25 ఉంటుంది. నెలకు రూ.25,000 చొప్పున పెట్టుబడి పెడితే 16 ఏళ్లలో రూ. కోటి సమకూర్చుకోవచ్చు. ఉద్యోగుల కోసం ఉద్దేశించిన ఈ రిటైర్మెంట్ పథకంలో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎన్‌పీఎస్ (NPS)
ఇందులో సుమారు 9% వడ్డీ వచ్చే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.25 వేలు పెట్టుబడి పెడుతూ.. సుమారు 15 ఏళ్లలో రూ. కోటి జమ చేయొచ్చు. పీఎఫ్ మాదిరిగా కాకుండా ఎన్‌పీఎస్ (National Pension System) మార్కెట్‌తో లింక్ చేయబడిన పథకం. వీటిలో కొంత రిస్క్ ఉంటుంది. కానీ, లాంగ్ టర్మ్ లో సుమారు 9% రాబడిని సాధించొచ్చు.
హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ (Hybrid Funds)
నెలకు రూ. 25 వేలు చొప్పున హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే.. 14 ఏళ్లలో రూ. కోటి సమకూర్చుకోవచ్చు. ఇందులో సుమారు 10% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఈక్విటీ (స్టాక్ మార్కెట్)లో కొంత, డెట్ (బాండ్లు) లలో కొంత పెట్టుబడి పెడతారు. అయితే వీటిపై వచ్చే లాభాలు పన్ను పరిధిలోకి వస్తాయి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (Equity Mutual Funds)
మార్కెట్ బాగా నడిస్తే.. ఇందులో సమారు 15% రిటర్న్స్ రావొచ్చు. ఈ లెక్కన నెలకు రూ. 25 వేలతో 12 ఏళ్లలోనే రూ. కోటి సంపాదించొచ్చు. వీటిలో SIP (Systematic Investment Plan) ద్వారా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే వీటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలి.


Click it and Unblock the Notifications