సాధారణంగా కొన్నేళ్ల పాటు బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే అది ఇనాక్టివ్ అయిపోతుంది. అంటే దానితో మీరు ట్రాన్స్ ఫర్, డిపాజిట్, విత్ డ్రా వంటివి చేయలేరు. అయితే ఇలా ఇనాక్టివ్ గా మారిపోయిన బ్యాంక్ అకౌంట్లను తిరిగి రీయాక్టివేట్ చేసుకోవచ్చు. పైగా దానికి ఎలాంటీ ఖర్చూ అవ్వదు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ బ్యాంక్ అకౌంట్ కొన్నేళ్లుగా వాడుకలో లేకపోతే బ్యాంక్ ఆ అకౌంట్ ను బ్లాక్ లేదా ఇనాక్టివ్ చేసేస్తుంది. అయితే పాత అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేస్తే డబ్బు ఖర్చవుతుందేమో అన్న భయంతో చాలామంది వాటిని అలాగే వదిలేస్తుంటారు. అయితే ఇలాంటి ఇనాక్టివ్ అకౌంట్లు కొన్ని సార్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తిరిగి రీయాక్టివేట్ చేసుకోవడం మంచిది. ఆర్ బీఐ రూల్స్ ప్రకారం మీ అకౌంట్ ను తిరిగి యాక్టివ్ చేయడానికి మీరు ఎలాంటి రుసము చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రాసెస్ ఇలా..
సుమారు పదేళ్లుగా ఇనాక్టివ్ గా ఉన్న అకౌంట్ ను తిరిగి యాక్టివేట్ చేయాలంటే ముందుగా మీరు కైవైసీ KYC ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు ఈ అడ్రెస్, ఫొటోతో కూడిన ఆధార్ కార్డ్ తో పాటు పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, అడ్రెస్ ప్రూఫ్ వంటివి సమర్పించాలి. ఆ తర్వాత బ్యాంక్ మీ గుర్తింపును ధృవీకరిస్తుంది. అప్పుడు మీ KYC కొత్తగా అప్ డేట్ అవుతుంది. ఇప్పుడు మీ అకౌంట్ తిరిగి యాక్టివ్ అవుతుంది. అయితే కొన్ని బ్యాంకులు అకౌంట్ ను యాక్టివేట్ చేయడానికి కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయమని కోరతాయి. అయితే ఆ డిపాజిట్ అమౌంట్ ను మీరు మళ్లీ విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఇలా రీయాక్టివేట్ చేయడానికి అదనంగా ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే అకౌంట్ రీయాక్టివేట్ అయిన తర్వాత SMS ఛార్జీలు, మినిమం అకౌంట్ బ్యాలెన్స్, చెక్ బుక్ ఛార్జీల వంటి కొన్ని సర్వీస్ ఛార్జీలు వర్తించొచ్చు. వాటి గురించి తెలుసుకుని వాటిని యాక్టివేట్ చేసుకోవాలి.
అకౌంట్ లో డబ్బు ఉంటే..
ఇకపోతే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీ అకౌంట్ లో డబ్బు ఉండి ఆ అకౌంట్ పని చేయకుండా ఇనాక్టివ్ అయినట్టయితే.. ఆ డబ్బుని బ్యాంకులు RBI యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేస్తాయి. అలా బదిలీ చేయబడిన డబ్బుని మీరు తిరిగి పొందాలంటే.. ముందుగా ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసి ఆ తర్వాత బ్యాంకు ద్వారా RBI కు క్లెయిమ్ చేసుకోవాలి. RBI మీ అకౌంట్ ను వెరిఫై చేసి ఆ మొత్తాన్ని మీకు తిరిగి రీ ఫండ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications