మనం ఒక కొత్త ఇల్లు కొనాలన్నా, కారు తీసుకోవాలన్నా లేదా పిల్లల చదువులకైనా సరే.. వెంటనే గుర్తొచ్చేది బ్యాంక్ లోన్. అప్పు తీసుకోవడం ఈ రోజుల్లో చాలా సులభం అయిపోయింది కానీ, ఆ అప్పును తిరిగి కట్టే EMI మీ ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తోందా? నెల నెలా వాయిదాలు కట్టలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారా? అయితే మీరు ఎంత అప్పు తీసుకోవాలి, ఎంత కట్టాలి అనే దానిపై ఒక అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

30 శాతం రూల్ అంటే ఏమిటి?
ఆర్థిక నిపుణులు చెప్పే ప్రాథమిక సూత్రం ఏంటంటే.. మీ నెలవారీ ఆదాయంలో మొత్తం EMI అనేది 25 నుండి 30 శాతం మించకూడదు. ఉదాహరణకు, మీ నెల జీతం రూ. 1,00,000 అనుకుంటే, మీ అన్ని లోన్ల (ఇల్లు, కారు, పర్సనల్ లోన్) వాయిదాలు కలిపి రూ. 25,000 నుండి రూ. 30,000 లోపు మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇది రూ. 40,000 లేదా రూ. 45,000 దాటితే, మీరు ప్రమాదకరమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్నారని అర్థం. అప్పుడు చిన్నపాటి అదనపు ఖర్చు వచ్చినా మీరు ఇబ్బందుల్లో పడతారు.
అప్పు తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కేవలం లోన్ వస్తుంది కదా అని తీసేసుకోకుండా, ఈ క్రింది అంశాలను ఒకసారి పరిశీలించండి..
- ఆదాయం స్థిరంగా ఉందా?: మీరు తీసుకునే లోన్ దీర్ఘకాలికమైనది అయితే (ఉదాహరణకు హోమ్ లోన్), మీ ఉద్యోగం లేదా వ్యాపారం అంతే స్థిరంగా ఉండాలి. రెగ్యులర్ ఆదాయం లేకపోతే అప్పుల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది.
- ఎమర్జెన్సీ ఫండ్ ఉందా?: కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును పక్కన పెట్టుకున్నాకే లోన్ గురించి ఆలోచించండి. ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఈ ఫండ్ మిమ్మల్ని కాపాడుతుంది.
- భవిష్యత్తు లక్ష్యాలు: పిల్లల పెళ్లిళ్లు, చదువులు, రిటైర్మెంట్ ప్లాన్స్ వంటివి దృష్టిలో పెట్టుకుని మీ EMI ని నిర్ణయించుకోండి. అప్పు కట్టడమే జీవితం అయిపోకూడదు, ఇతర అవసరాలకు కూడా డబ్బు మిగలాలి.
- వడ్డీ రేట్లు: పర్సనల్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్ అప్పులపై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వడ్డీ రేటులో వచ్చే చిన్న మార్పు కూడా మీపై పెద్ద భారాన్ని చూపుతుంది. అందుకే అన్ని నిబంధనలు చదివాకే సంతకం చేయండి.
జీవితం అంటే కేవలం అప్పులు కట్టడం మాత్రమే కాదు, హాయిగా బతకడం కూడా. మీ లైఫ్ స్టైల్ భారంగా కాకుండా ఉండాలంటే, అప్పును మీ ఆదాయంలో 30% లోపు ఉంచుకోండి. మీకు ఇంకా సందేహాలు ఉంటే ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించి, మీ క్రెడిట్ ప్రొఫైల్ బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. గుర్తుంచుకోండి, మీరు కట్టగలిగే శక్తి కంటే, మీరు సౌకర్యవంతంగా భరించగలిగే అప్పు తీసుకోవడమే తెలివైన పని!


Click it and Unblock the Notifications