కార్పొరేట్ ఉద్యోగులకు భారీ షాక్.. వచ్చిన జీతమంతా ఆస్పత్రి ఖర్చులకే.. సర్వే చెప్పిన నిజాలు..
ప్రస్తుత కాలంలో కార్పొరేట్ ఉద్యోగులను వేధిస్తున్న ప్రధాన ఆర్థిక సమస్య ఉద్యోగ భద్రత కాదని, రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న వైద్య ఆరోగ్య సంరక్షణ ఖర్చులేనని టాటా ఏఐజి జనరల్ ఇన్సూరెన్స్ నిర్వహించిన "కార్పొరేట్ హెల్త్ ప్రొటెక్షన్ పల్స్ 2026" సర్వే సంచలన విషయాన్ని వెల్లడించింది.
ఊహించని రీతిలో ముంచుకొచ్చే వైద్య ఖర్చులు తమ కుటుంబాలను తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టివేస్తున్నాయని సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా తొంబై నాలుగు శాతం మంది స్పష్టం చేశారు. ఆసుపత్రుల బిల్లులు, జీవనశైలి ఆధారిత వ్యాధులు, కుటుంబ ఆరోగ్య రక్షణ, తగినంత అత్యవసర పొదుపు లేకపోవడం వంటి అంశాలు ఉద్యోగులలో రోజురోజుకూ ఆందోళనను పెంచుతున్నాయి.
ఈ సర్వే ఉద్యోగుల ఆర్థిక బలహీనతను కూడా స్పష్టంగా ఎత్తిచూపింది. తాము పనిచేస్తున్న ఉద్యోగం గనకపోతే, కేవలం ఆరు నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం మాత్రమే తమ వద్ద ఉన్న డబ్బుతో ఆర్థికంగా నెట్టుకురాగలమని పది మందిలో ఏడుగురు (దాదాపు డెబ్బై శాతం మంది) ఉద్యోగులు అంగీకరించారు.

ఉద్యోగం లేకుండా ఒక సంవత్సరానికి పైగా తమ జీవితాన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపగలమని కేవలం పన్నెండు శాతం మంది మాత్రమే ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పూణే, కోల్‌కతా ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన 748 మంది కార్పొరేట్ ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదికను రూపొందించారు.
కంపెనీలు అందించే గ్రూప్ మెడికల్ కవరేజ్ (GMC) అత్యవసర వైద్య పరిస్థితులలో ఎంతవరకు ఆదుకుంటుందనే దానిపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదైనా పెద్ద వైద్య అత్యవసర పరిస్థితి లేదా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు తమ యజమాని ఇచ్చే ఆఫీస్ బీమా పాలసీ ఒక్కటే సరిపోదని డెబ్బై ఐదు శాతం మంది అభిప్రాయపడ్డారు.
కంపెనీ బీమాతో పాటు సొంతంగా అదనపు వ్యక్తిగత ఆరోగ్య బీమా కలిగి ఉండటం అత్యంత కీలకమని ఎన్భై నాలుగు శాతం మంది చెప్పినప్పటికీ, అందులో నలభై ఐదు శాతం మందికి ఆఫీస్ ఇచ్చే జీఎంసీ తప్ప ఎలాంటి వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ లేదని తేలింది. సంస్థలు ఇచ్చే గ్రూప్ మెడికల్ కవర్ అనేది ప్రాథమికంగా ఉపయోగపడినప్పటికీ.. అత్యవసర సమయాల్లో అది ఎంతవరకు సరిపోతుందనే దానిపై ఉద్యోగులకు స్పష్టత లేదని టాటా ఏఐజి రిటైల్-హెల్త్ అండర్‌రైటింగ్ విభాగాధిపతి డాక్టర్ సంతోష్ పూరి వ్యాఖ్యానించారు.
ఇక ఉద్యోగం మారే సందర్భాలలో ఆరోగ్య బీమా వ్యవధిలో ఏర్పడే అంతరం (కవరేజ్ గ్యాప్) మరొక ప్రధాన ఆర్థిక సమస్యగా మారింది. ఒక ఆఫీస్ నుండి ఇంకో ఆఫీస్‌కు మారే సమయంలోనూ ఆరోగ్య బీమా కవరేజ్ నిరంతరాయంగా కొనసాగడం చాలా అవసరమని ఎన్భై ఎనిమిది శాతం మంది అభిప్రాయపడ్డారు.
కానీ ఉద్యోగ మార్పిడి సమయంలో కూడా మెడికల్ కవరేజీని నిరంతరంగా పొందేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక, ఆర్థిక పరిష్కారాల పట్ల కేవలం నలభై శాతం మందికి మాత్రమే అవగాహన ఉండటం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ, తమ కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక రక్షణ కల్పించాలనే ఆలోచనే ఉద్యోగులను అదనపు వ్యక్తిగత బీమా తీసుకునేలా ప్రోత్సహిస్తోందని ఈ సర్వే అధ్యయనం స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications
