HDFC: లోన్లు తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు..
ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు హెచ్డీఎఫ్సీ కీలక ప్రకటన చేసింది. ఈ బ్యాంకు వివిధ కాలపరిమితులకు సంబంధించిన తన 'మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్' (MCLR)ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ సవరించిన రేట్లు సెప్టెంబర్ 7 నుండి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం సవరించిన MCLR రేట్లు 7.90 శాతం నుంచి 8.60% మధ్య ఉన్నాయి. గతంలో ఇవి 8 శాతం నుంచి 8.65 శాతం మధ్య ఉండేవి. ఒక బేసిస్ పాయింట్ అనేది ఒక శాతం పాయింట్‌లో వందో వంతుకు సమానం. MCLR అనేది కొన్ని రకాల రుణాలకు వడ్డీ రేట్లను నిర్ణయించడానికి బ్యాంకులు ఉపయోగించే ఒక ప్రామాణిక రుణ రేటు అని అర్థం.
MCLRతో అనుసంధానించబడిన రుణాలను తీసుకున్న వారికి ఈ ప్రామాణిక రేటులో మార్పు రావడం వల్ల వడ్డీ రేటుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తద్వారా రుణ నిబంధనలను బట్టి నెలవారీ వాయిదా (EMI) లేదా రుణ కాలపరిమితిలో మార్పులు రావచ్చు. ఓవర్‌నైట్ (ఒక రోజు), 1-నెల కాలపరిమితి గల MCLR రేట్లు రెండూ గతంలో ఉన్న 8.00 శాతం నుంచి 7.90 శాతానికి తగ్గించింది. 3-నెలల రేటు ఇప్పుడు 8.05 శాత వద్ద ఉంది. 6-నెలల MCLR రేటు 8.30 శాతం నుంచి 8.25%కి తగ్గించింది. 1-ఏడాది రేటు 8.40 శాతం నుంచి 8.35 శాతాకి తగ్గింది. దీర్ఘకాలిక విభాగంలో 2-ఏళ్ల MCLR రేటు 8.55% నుంచి 8.45%కి చేరింది.

3-ఏళ్ల కాలపరిమితి రేటు 8.65% నుంచి 8.60%కి తగ్గింది. మొత్తంగా చూస్తే, సెప్టెంబర్ నెలలో చేసిన ఈ సవరణ ద్వారా HDFC బ్యాంక్ తన జాబితాలోని అన్ని కాలపరిమితుల MCLR రేట్లలో 5 నుండి 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. MCLR అనేది ఒక నిర్దిష్ట రుణ వర్గానికి బ్యాంక్ అంతకంటే తక్కువ వడ్డీకి రుణం ఇవ్వకూడని కనీస రేటు. ఇది రుణాల ధరలను (వడ్డీ రేట్లను) నిర్ణయించే కనీస ప్రామాణికతను నిర్దేశిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించిన కొన్ని ప్రత్యేక మినహాయింపులు తప్ప, రుణదాతలు ఈ పరిమితి కంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వకూడదు. ఆర్బీఐ 2016లో MCLR విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇతర విషయానికొస్తే బ్యాంక్ 'బేస్ రేట్' 8.70 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. జూన్ 24 2026 నుంచి ఈ స్థాయి అలాగే ఉంది. అదే తేదీన HDFC బ్యాంక్ బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ వార్షికంగా 17.30 శాతం నుంచి 17.20 శాతానికి తగ్గించింది. ఇక డిపాజిట్ల విషయానికి వస్తే, HDFC బ్యాంక్ సాధారణ డిపాజిటర్లకు 2.75% నుంచి 6.50% మధ్య, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7 శాతం మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
