మార్కెట్ ఈ వారం మరింత పతనమవుతుందా, బంగారం రూ.50,000 క్రాస్ చేస్తుందా?
స్టాక్ మార్కెట్లు గతవారం భారీగా నష్టపోగా, బులియన్ మార్కెట్ పరుగులు పెట్టింది. అంతర్జాతీయ ద్రవ్యోల్భణ ఆందోళనలు, వడ్డీ రేట్ల పెంపుకు అమెరికా ఫెడ్ సంకేతాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. నవంబర్ 24వ తేదీన సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ ప్రభావం అంతంత మాత్రమే అని డిసెంబర్ ప్రారంభంలో భావించారు. అయితే ఈ మహమ్మారి మరిన్ని దేశాలకు విస్తరించడంతో భయాందోళనలు కమ్ముకున్నాయి. అమెరికా ద్రవ్యోల్భణం, నిరుద్యోగిత రేటు కూడా భారీగా పెరిగాయి. దీనికి తోడు మన దేశంలో రిటైల్ ద్రవ్యోల్భమం మూడు నెలల గరిష్టానికి, హోల్ సేల్ ద్రవ్యోల్భణం 12 సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది.
అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి 3.2 శాతం తగ్గగా, వాణిజ్య లోటు 2291 కోట్ల డాలర్లుగా నమోదయింది. చమురు డిమాండ్ భయాందోళనతో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేసేందుకు పలు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి.. మరిన్ని దేశాలు ఈ బాటలో నడుస్తున్నాయి. ఈ వారం కూడా ఒమిక్రాన్, ద్రవ్యోల్భణం సహా వివిధ ఆందోళనలు మార్కెట్ పైన ప్రభావం చూపించవచ్చు.
దీనికి తోడు కేంద్ర ఆర్థిక శాఖ వరి, గోధుమ, శనగలు, ఆవాలు, సోయా బీన్స్, ముడి పామాయిల్, పెసర కమోడిటీ ట్రేడింగ్‌ను ఏడాదిపాటు నిలిపివేయాలని సెబీని కోరినట్లు వార్తలొచ్చాయి. ఈ ప్రభావం మార్కెట్ పైన పడింది. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసిన ప్రభావం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు నేటివారం నష్టాల్లో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపించవచ్చు. ఈ ధరలు పెరిగే అవకాశముంది.

అంచనాలకు అనుగుణంగా.. భారీ క్షీణత
అంతకుముందు వరుసగా రెండు వారాలు రాణించిన మార్కెట్ గతవారం మాత్రం నష్టపోయాయి. 59,100 పాయింట్ల వద్ద బలమైన నిరోధకం ఎదురు కావడంతో కుదైలయింది. స్వల్పకాలంలో ఈ స్థాయి నిరోధస్థాయిగా కొనసాగుతుంది. మరోవైపు 56,700 పాయింట్ల దిగువకు వస్తే 55,000 - 55,800 పాయింట్ల వరకు దిద్దుబాటుకు గురికావొచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.
అందుకు అనుగుణంగా నేడు మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ మధ్యాహ్నం గం.11 సమయానికి 1271 పాయింట్లు క్షీణించి 55,750 పాయింట్ల దిగువకు వచ్చింది. ఆ తర్వాత రికవరీ కనిపిస్తే 58,100 పాయింట్ల వద్ద నిరోధకం ఉండవచ్చునని చెబుతున్నారు.

ఆ దిగువకు వస్తే...
ఈ వారం మార్కెట్లు భారీ నష్టాల్లో, అప్రమత్తంగా కదలాడే అవకాశం ఉంది. ఒమిక్రాన్ వ్యాప్తి కీలకం. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ, ముడి చమురు ధరలపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారు. ఆయా రంగాలు, ఆయా స్టాక్స్ కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. తక్షణ మద్దతు 56,700, 56,120. తక్షణ నిరోధకస్థాయి 57,500, 58,075 పాయింట్లు. సెన్సెక్స్ 56,400 దికువకు వస్తే మరింత పతనం కావొచ్చుననే అంచనాలు ఉన్నాయి.

బంగారం రూ.50,000 దాటుతుందా?
బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 1800 డాలర్ల వద్ద బలమైన నిరోధకం కనిపిస్తోందని, అంటే దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.48,600 స్థాయిలో నిరోధకం కనిపిస్తోందని అంటున్నారు. అయితే 2022లోకి మాత్రం భారీ పెరుగుదలతో అంటే 1835 డాలర్ల స్థాయిలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే మన వద్ద రూ.50,000 క్రాస్ చేస్తుంది.


Click it and Unblock the Notifications