క్రెడిట్ కార్డును ఇలా ఉపయోగించండి, కార్డులు రకాలు
క్రెడిట్ కార్డు వినియోగం ఇప్పుడు సాధారణం. క్రెడిట్ స్కోర్ బాగుంటే, నిర్దిష్ట ఆదాయం ఉంటే క్రెడిట్ కార్డు సులభంగా వస్తుంది. కార్డుల వాడకం పెరగడంతో వీటిని జారీ చేసే సంస్థలు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల కార్డులను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వందలాది క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో నుండి మీకు సరిపోయే క్రెడిట్ కార్డును ఎంచుకోవడం కష్టమే. కార్డుల దుర్వినియోగం, మోసాల గురించి ప్రతిరోజు వింటున్నాం. మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నవారు ఇందులో ఉన్న లాభ,నష్టాలను ముందుగా తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఎంపిక చేసుకొని, కార్డును ఉపయోగిస్తే నష్టాలను నివారించి ప్రయోజనం పొందవచ్చు.

కార్డుల రకాలు
దేశంలో అనేక రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ క్రెడిట్ కార్డ్స్, క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్, ట్రావెల్ క్రెడిట్ కార్డ్స్, ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్, స్టూడెంట్ కార్డ్స్, బిజినెస్ కార్డ్స్, స్టోర్ క్రెడిట్ కార్డ్స్.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటిలో మీకు సరిపోయే క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి. ఉదాహరణకు తరుచూ ప్రయాణించే వారు ట్రావెల్ కార్డు, ఎక్కువగా ఆన్ లైన్ కొనుగోళ్లు చేసేవారు క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ కార్డు, వాహనాలను ఎక్కువగా వినియోగించే వారు ఫ్యూయల్ కార్డు ఉపయోగించాలి.

క్రెడిట్ కార్డు పరిమితి
క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు కస్టమర్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని చూస్తాయి. అందుకే క్రెడిట్ కార్డు ఎంపికలో ఆదాయం ముఖ్యం. మీ ఆదాయ బ్రాకెట్‌లో నిర్దిష్ట పెరుగుదల ఉంటే కార్డు ఎంపికలో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి.
బ్యాంకులు కొంత పరిమితితో కూడిన కార్డులను జారీ చేస్తాయి. పరిమితి ఎక్కువగా ఉంటే ఎక్కువగా అనవసర ఖర్చు చేయవచ్చు. కాబట్టి తొలిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటే తక్కువ లిమిట్‌తో తీసుకోవాలి.

ఛార్జీలు
ప్రతి క్రెడిట్ కార్డుకు వడ్డీ లేని కాలపరిమితి ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. ఆ గడువులోగా చెల్లిస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. గడువులోగా చెల్లించకుంటే మాత్రం వడ్డీ మీద వడ్డీ విధిస్తారు. ఇది భారమే. గడువు తర్వాత ఎంత వడ్డీ ఉంటుందో తెలుసుకోవాలి.
వార్షిక ఫీజు, ఏటీఎం నగదు ఉపసంహరణ చార్జీ, లేట్ ఫీజు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. బిల్లింగ్ సైకిల్ ఎక్కువ రోజులు ఉన్న కార్డును ఎంచుకోవడం మంచిది.

40 శాతం మించకుండా
కార్డును ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్సాక్షన్ తర్వాత ఫోన్‌కు నోటిఫికేషన్ వచ్చేలా ఉండాలి. క్రెడిట్ కార్డు బిల్లును గడువులోగా చెల్లించాలి. పిన్ నెంబర్, అకౌంట్ వివరాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డు మిస్ అయితే బ్లాక్ చేయించాలి. మన క్రెడిట్ కార్డు వినియోగం దాదాపు 40 శాతం మించకుండా చూసుకోవాలి.


Click it and Unblock the Notifications