Crisis Commodity: బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు ఇవే, ఎందుకు?
బంగారం ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. కరోనా కారణంగా ఆగస్ట్ 7, 2020న రూ.56,200 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పసిడి ధరలు, ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మళ్లీ రూ.55,000 క్రాస్ చేశాయి. తిరిగి ఇప్పుడు రూ.51,500 దిగువకు వచ్చాయి. గత వారం పసిడి ధరలు రూ.4000 వరకు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ ఇటీవల ఆల్ టైమ్ గరిష్టం 2075 సమీపానికి చేరుకున్నాయి. ఇప్పుడు తిరిగి 1930 డాలర్ల స్థాయిలో ఉన్నాయి. బంగారానికి భారత్‌లో ఆదరణ ఎక్కువ. ఇలాంటి పసిడి పెరుగుదల, తగ్గుదలకు ఎన్నో కారణాలు ఉంటాయి. ఇందులో పసిడిపై ప్రభావం చూపే ప్రధాన అంశాలు...

ద్రవ్యోల్భణం సమయంలో...
పసిడి ధరలు జనవరి 22వ తర్వాత నెల రోజుల్లో 0.028 శాతం క్షీణించగా, ఫిబ్రవరి 22 నుండి 0.127 శాతం పెరిగాయి. మార్చి 22 తర్వాత ఇప్పటి వరకు 0.022 శాతం తగ్గాయి. మున్ముందు కూడా ఇలాగే, పైకి కిందకు కదలాడే అవకాశాలున్నాయి. బంగారం ధరలపై డిమాండ్ అండ్ సరఫరా, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్భణం, దిగుమతి సుంకాలు, గవర్నమెంట్ రిజర్వ్స్ వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.
ఇన్వెస్టర్ కరెన్సీ కంటే బంగారాన్ని అట్టి పెట్టుకోవడం ద్వారా ద్రవ్యోల్భణం అధికంగా ఉన్న సమయంలో కాస్త ధీమాగా ఉండవచ్చు చెందవచ్చు అనేది మార్కెట్ నిపుణుల మాట.
కరెన్సీతో పోలిస్తే బంగారం దాదాపు స్థిరంగా ఉంటుంది. ఇది ద్రవ్యోల్భణాన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉంటే బంగారం డిమాండ్ పెరుగుతుంది. అంతర్జాతీయ ద్రవ్యోల్భణం, భారత ద్రవ్యోల్భణానికి ఇది వర్తిస్తుంది.

అంతర్జాతీయ కదలికలు
బంగారం ధరలో ఏదైనా గ్లోబల్ మూవ్‌మెంట్ భారత్‌లో పసుపు లోహం ధరను ప్రభావితం చేస్తుంది. బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఉంది. ఏదైనా రాజకీయ సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధాలు వంటివి ఉద్భవించినప్పుడు ఆర్థిక ఉత్పత్తుల విలువ పెరగవచ్చు తగ్గవచ్చు. పసిడి ధరలు మాత్రం పెరుగుతాయి. శాంతియుత వాతావరణంతో పోలిస్తే ఉద్రిక్తతలు చోటు చేసుకున్న పరిస్థితుల్లో పసిడి ధరలు పెరుగుతాయి. అందుకే బంగారాన్ని క్రైసిస్ కమోడిటీ (సంక్షోభ లోహం) పిలుస్తారు.

ప్రభుత్వ బంగారం నిల్వలు
ప్రధాన దేశాలు అన్ని కరెన్సీతో పాటు బంగారం నిల్వలను కలిగి ఉంటాయి. అమెరికా యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకు రెండు ప్రధాన ఉదాహరణలు. పెద్ద దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను కలిగి ఉండటం, మరింత బంగారాన్ని సేకరిండం ప్రారంభించినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. బంగారం ధరలు తగ్గుతున్న సమయంలోను మార్కెట్‌లోకి నగదు ప్రవాహం పెరగడం ఇందుకు కారణం.

జ్యువెల్లరీ మార్కెట్
భారతీయులు బంగారాన్ని అధికంగా ఇష్టపడతారు. పండుగలు, పుట్టిన రోజు వంటి సమయాల్లో పసిడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. పెళ్లిళ్ల సీజన్, దీపావళి సమయాల్లోను బంగారానికి డిమాండ్ ఎక్కువ. ఇలాంటి సమయాల్లోను పసిడి ధరలు పెరుగుతాయి.

వడ్డీ రేటు ప్రభావం
బ్యాంకుల వడ్డీ రేటు అంశం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం కలిగిన వారు వాటిని విక్రయించి ఆ పెరిగిన వడ్డీ రేటుతో నగదును సంపాదించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మాత్రం బంగారం ధరలు పెరుగుతాయి.

దిగుమతి సుంకాలు
బంగారంపై విధించే దిగుమతి సుంకాల ప్రభావం కూడా పసిడి పైన ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచితే ధరలు పెరుగుతాయి, తగ్గిస్తే తగ్గుతాయి.బంగారం ధరలు పెరగడానికి అధిక లిక్విడిటీ, ఎక్స్చేంజ్ రేటు, గోల్డ్ మైనింగ్ పెరగడం, తగ్గడం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.


Click it and Unblock the Notifications