10 ఏళ్లు దాటిన మైనర్లు కూడా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం ఓపెన్ చేయవచ్చు
జూన్-సెప్టెంబర్ త్రైమాసికానికి ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ స్కీంపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అయిదేళ్ల నెలవారీ ఆదాయ పథకం సంవత్సరానికి 6.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. దీనిపై నెలవారీ ఆదాయం చెల్లింపు ఉంటుంది. ఇందులో పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీం (POMIS) ఒకటి. ఇందులో మీరు ఒక నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, ప్రతి నెల స్థిరవడ్డీని సంపాదించవచ్చు. ఈ ఖాతాను మీ సమీపంలోని పోస్టాఫీస్‌లో ఓపెన్ చేయవచ్చు.

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం
ఏ భారతీయ నివాసి అయినా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం అకౌంట్ తెరవవచ్చు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఉమ్మడిగా ఖాతాను తెరుచుకోవచ్చు. అంతేకాకుండా పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ కూడా వారి పేరుతో ఈ ఖాతాను తెరుచుకోవచ్చు.
ఈ అకౌంట్ తెరవడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1000. ఒకరి పేరుతో ఖాతాను ప్రారంభించినప్పుడు గరిష్టంగా రూ.4.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ పరిమితి రూ.9 లక్షలు, ఇందులో పెట్టుబడిదారులకు సమాన వాటా ఉంటుంది.

వడ్డీ చెల్లింపు
అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుండి ఒక నెల పూర్తయిన తర్వాత వడ్డీ చెల్లింపు ప్రారంభమవుతుంది. ఇది మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. ప్రతి నెల చెల్లించే వడ్డీని క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితుల్లో అలాంటి వడ్డీపై అదనపు వడ్డీ లభించదు.
నిర్ణీత పరిమితికి మించి ఎక్కువ డిపాజిట్స్ చేస్తే తిరిగి రీఫండ్ అవుతుంది. ఒకవేళ అదనపు డిపాజిట్ చేస్తే దానిపై పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు ఇచ్చే వడ్డీ రేటు ఉంటుంది. అదనపు డిపాజిట్‌ను తిరిగి రీఫండ్ చేసే వరకు ఇది వర్తిస్తుంది.

ఆటో క్రెడిట్ ఆప్షన్...
ఆటో క్రెడిట్ ఆప్షన్ ఎంచుకుంటే ప్రతి నెల వడ్డీని నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలోకి వస్తుంది. అయితే ఈ వడ్డీ ప్రయోజనం పన్ను పరిధిలోకి వస్తుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 80సీ కిందకు ఇది రాదు. అకౌంట్ తెరిచిన పోస్టాఫీస్ వద్ద పాస్‌బుక్‌తో సూచించిన దరఖాస్తు ఫాంను సమర్పించి అయిదేళ్ల తర్వాత ఖాతాను క్లోజ్ చేయవచ్చు. ఏడాది తర్వాత, మూడేళ్ల ముందు ఖాతాను క్లోజ్ చేస్తే డిపాజిట్ నుండి 2 శాతం తగ్గిస్తారు. మూడేళ్ల నుండి అయిదేళ్ల మధ్య ఖాతాను నిలిపివేస్తే ఒక శాతం మినహాయిస్తారు.


Click it and Unblock the Notifications