దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..
దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల చాలామంది భారతీయులు దుబాయ్‌లో ఇళ్లను బుక్ చేసుకోవడానికి లేదా ప్రారంభ డిపాజిట్లు చెల్లించడానికి తమ అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను (ICCs) ఉపయోగిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ విధానం నేరుగా విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కిందకు వస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నిజానికి క్రెడిట్ కార్డు ద్వారా చేసే ఖర్చులు కేవలం ప్రయాణాలు, విద్యా సంబంధిత ఫీజులు లేదా విదేశాల్లో ఉన్నప్పుడు చేసే వ్యక్తిగత కొనుగోళ్ల వంటి 'కరెంట్ అకౌంట్' లావాదేవీలకు మాత్రమే పరిమితం కావాలి. కానీ విదేశాల్లో స్థిరాస్తిని కొనడం అనేది 'క్యాపిటల్ అకౌంట్' లావాదేవీగా పరిగణించబడుతుంది. భారతీయ చట్టాల ప్రకారం, అప్పుగా తీసుకున్న సొమ్ముతో (క్రెడిట్ కార్డు ఒక రకమైన అప్పు) విదేశాల్లో ఆస్తులు సృష్టించడం నిషిద్ధం. కేవలం పన్నులు చెల్లించిన సొంత పొదుపు మొత్తాన్ని మాత్రమే అధికారిక బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా విదేశాలకు పంపి ఆస్తులు కొనాల్సి ఉంటుంది. ఈ నిబంధనను పక్కన పెట్టి క్రెడిట్ కార్డులతో చెల్లింపులు జరిపిన పలువురు వ్యక్తులకు ఇప్పటికే ఈడీ నోటీసులు పంపింది.

ఈ విధంగా క్రెడిట్ కార్డులు వాడటం వెనుక ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, LRS పరిమితి అయిన 2.5 లక్షల డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయడానికి ప్రయత్నించడం, రెండోది కేవలం సౌకర్యం కోసం లేదా అవగాహన లేక ఇలా చేయడం. అయితే కారణం ఏదైనప్పటికీ.. ఈడీ దృష్టిలో ఇది తీవ్రమైన ఉల్లంఘనగానే పరిగణించబడుతుంది. ఇలాంటి తప్పులు చేసిన వారు భవిష్యత్తులో భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆర్‌బీఐ సదరు లావాదేవీని రద్దు చేసి, ఆ సొమ్మును తిరిగి భారత్‌కు రప్పించాలని కూడా ఆదేశించవచ్చు. ఒకవేళ ఆస్తి కొనుగోలు పూర్తయి ఉంటే, దానిని విక్రయించి నిధులను వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
ప్రస్తుతం ఈ చిక్కుల్లో ఉన్నవారు తమ తప్పును సరిదిద్దుకోవడానికి 'కాంపౌండింగ్' అనే ప్రక్రియను ఆశ్రయించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంటే, తాము చేసిన పొరపాటును స్వచ్ఛందంగా ఆర్‌బీఐకి వివరించి, నిర్ణీత రుసుము లేదా జరిమానా చెల్లించడం ద్వారా విషయాన్ని పరిష్కరించుకోవచ్చు. హవాలా వంటి అక్రమ మార్గాల్లో కాకుండా కేవలం పొరపాటున క్రెడిట్ కార్డు వాడిన వారికి ఈ ప్రక్రియ కొంత ఊరటనిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, విదేశాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కేవలం ఆస్తి విలువనే కాకుండా, అందుకు సంబంధించిన ఫారెక్స్ నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవడం అత్యవసరమని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications