'బిట్ కాయిన్ ఆ ఒక్క కారణంతో కొనుగోలు చేస్తారు, నేను ఈ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయను'
క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌లో పెట్టుబడులు వద్దని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా జెరోదా ఫౌండర్ అండ్ సీఈవో నితిన్ కామత్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బిట్ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేయవద్దని, చైనాలో ఏం జరుగుతుందో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు తెలిసి ఉంటుందని వ్యాఖ్యానించారు.
కరోనా మహమ్మారి సమయంలో, ఆ తర్వాత బిట్ కాయిన్‌లో టెస్లా పెట్టుబడులు, ఇతర కంపెనీలు క్రిప్టోకు ఇచ్చే ప్రాధాన్యత, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో బిట్ కాయిన్, ఎథేరియం, డోజికాయిన్ సహా వివిధ క్రిప్టోలు భారీగా ఎగిసి, ఇప్పుడు పతనమవుతోన్న విషయం తెలిసిందే. దీంతో క్రిప్టో పెట్టుబడిదారులు ఆందోళనగా ఉన్నారు. ఈ అంశంపై నితిన్ కామత్ స్పందించారు.

అప్పుడు జెరోదా కొనుగోలు చేస్తుంది
ప్రజలు లేదా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో క్రిప్టోకరెన్సీ వాటాను ఒకటి లేదా రెండు శాతానికి మించకుండా చూసుకోవాలని నితిన్ కామత్ సూచించారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కొనుగోలుకు చాలామంది ఆసక్తి కనబరచడం వెనుక ఉన్న ఒకే ఒక కారణం మీ వద్ద నుండి ఎవరైనా ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేస్తారనే ఆశ మాత్రమే అన్నారు. కానీ ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. క్రిప్టో నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు జెరోదా వాటిని కొనుగోలు చేస్తుందన్నారు.

ఎందుకు పెరిగిందో, ఎందుకు పతనమైందో
క్రిప్టోకరెన్సీ ఇప్పటికీ అస్థిరమైన మార్కెట్ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బిట్ కాయిన్ వంటి క్రిప్టో ఆల్ టైమ్ గరిష్టం నుండి 40 శాతానికి పైగా క్షీణించింది. ఓ సమయంలో 65వేల డాలర్లు పలికిన ఈ క్రిప్టో ఇప్పుడు 40వేల డాలర్ల దిగువకు వచ్చింది. ఎథేరియం, డోజీకాయిన్ కూడా స్వల్పంగా తగ్గాయి.
పతనమైన ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలు చేయాలని కొందరు మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కానీ బిట్ కాయిన్ కేవలం ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్మడానికి తప్ప మరో మార్గం లేదనేది మరికొందరి మాట. క్రిప్టో కరెన్సీ పతనం గురించి నితిన్ కామత్ స్పందిస్తూ... బిట్ కాయిన్ ఎందుకు పెరిగిందో, ఎందుకు పతనమైందో అర్థం కావడం లేదని చెప్పారు.

బిట్ కాయిన్‌కు దూరం
ఎలాన్ మస్క్ హఠాత్తుగా వచ్చి బిట్ కాయిన్ గురించి మాట్లాడిన విధానం చూస్తుంటే చైనాలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసునని అర్థమవుతోందని అన్నారు. ఓ వైపు భారత్‌లో క్రిప్టోలో చాలామంది ఎంతో ఆసక్తిగా క్రిప్టోలో పెట్టుబడులు పెడుతుండగా, నితిన్ కామత్ మాత్రం దూరం అంటున్నారు. వ్యక్తిగతంగా బిట్ కాయిన్‌ను తాను ఆస్తిగా పరిగణించడం లేదని, అందుకే అందులో పెట్టుబడులు పెట్టనన్నారు. ఎవరైనా బిట్ కాయిన్‌ను కొనుగోలు చేస్తున్నారంటే ఏకైక కారణం దానిని అధిక ధరకు ఎవరైనా తిరిగి కొనుగోలు చేస్తారనే ఆశ మాత్రమేనని, మరో ఉపయోగం మాత్రం లేదని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications