మీకు డబ్బులుపై సలహా ఇచ్చే ప్రతోడు నకిలీనే.. గుడ్డిగా నమ్మి రోడ్డు మీద పడకండి.. రాబర్ట్ కియోసాకి కీలక వ్యాఖ్యలు
ఆర్థిక స్వాతంత్ర్యం, పెట్టుబడులు, సంపద సృష్టి వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకుని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు దాని వెనుక స్పష్టమైన ఉద్దేశం, విలువ సృష్టించే ఆలోచన, సమాజానికి ఉపయోగపడే దృష్టికోణం ఉండాలని సూచించారు. ఈ మేరకు Robert Kiyosaki సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌గా మారింది.
ప్రజలు నన్ను ఎప్పుడూ ఒక ప్రశ్న అడుగుతుంటారు: "రాబర్ట్, నేను కేవలం డబ్బు సంపాదించడం కోసమే వ్యాపారవేత్త అవ్వాలా అని.. దానికి నేను చెప్పే ఒకే ఒక్క నిజం.. మీరు కేవలం డబ్బు కోసమే వ్యాపారవేత్త అవుతున్నట్లయితే, మీరు ఇప్పటికే పెద్ద చిక్కుల్లో పడ్డట్టే. ఎందుకంటే ఈ రోజుల్లో చుట్టూ ఉన్న చాలా డబ్బు నకిలీది, చాలా పెట్టుబడులు నకిలీ ఆస్తులే, అలాగే ఆర్థిక సలహాలు ఇచ్చే చాలా మంది నకిలీ గురువులే.

దీనికి కారణం చాలా స్పష్టం. మీకు ఏది జరిగినా సరే నెలాఖరుకు జీతం తీసుకునే ఆర్థిక ప్రణాళికదారులు మీ డబ్బుతో ఏమి చేయాలో మీకు సలహాలు ఇస్తుంటారు. అలాగే తమ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న వ్యాపారాన్ని కూడా నిర్మించని పాఠశాల ఉపాధ్యాయులు తరగతి గదుల్లో వ్యాపారం గురించి బోధిస్తుంటారు. వారు తమ జీవితంలో ఎవరికీ జీతాలు చెల్లించలేదు, నగదు ప్రవాహాన్ని నిర్వహించలేదు, దేనికీ రిస్క్ తీసుకోలేదు, కానీ మీకు మాత్రం డబ్బు ఎలా సంపాదించాలో బోధిస్తుంటారు. ఇది నిజంగా ఒక పిచ్చిపని.
ఇక్కడ మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న "నేను ఎంత డబ్బు సంపాదించగలను?" అనేది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే.. మీ చేతికి డబ్బు వచ్చాక దానితో మీరు ఏమి చేస్తారు? ఎందుకంటే నిజ జీవితంలో ఎవరైనా ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించగలరు. మీరు క్రిప్టో కరెన్సీతో రాత్రికి రాత్రే అదృష్టవంతులు కావచ్చు, లాటరీ గెలవవచ్చు, వారసత్వంగా ఆస్తిని పొందవచ్చు లేదా అనుకోకుండా ఏదైనా విజయవంతమైన వ్యాపారంలోకి అడుగు పెట్టవచ్చు. కానీ, అలా వచ్చిన డబ్బును ఎక్కువ కాలం నిలుపుకోగలవారు మార్కెట్లో చాలా తక్కువ మంది ఉంటారు.
ఆ డబ్బును ఉపయోగించి నిజమైన ఆస్తులను ఎలా కొనాలో తెలిసినవారు అంతకన్నా తక్కువ మంది ఉంటారు. కొంతమంది లక్షల డాలర్లు సంపాదించి, కేవలం ఏడాది తిరగకముందే అదంతా పోగొట్టుకుని రోడ్డున పడటం నేను కళ్లారా చూశాను. ఎందుకు అంటే వారు డబ్బు సంపాదించడానికి ముందే ఆర్థిక విషయాలలో పూర్తి తెలివి తక్కువగా ఉన్నారు, అకస్మాత్తుగా డబ్బు రావడం వారిని తెలివైనవారిగా మార్చలేదు.
వ్యాపారవేత్తగా ఉండటం అంటే కేవలం ధనవంతులు అవ్వడం కాదు, అది ఆర్థిక విషయాలలో విద్యావంతులు అవ్వడం. ఎందుకంటే మీరు ఆఫ్‌లైన్‌లో ఆర్థిక విషయాలలో అవగాహన లేనివారిగా ఉంటే, ఆన్‌లైన్ ప్రపంచంలోకి వచ్చినా అలాగే ఉంటారు. నిజ జీవితంలో మీకు నగదు ప్రవాహం, అప్పు, ఆస్తుల గురించి కనీస అవగాహన లేకపోతే.. కేవలం మీరు ఒక కొత్త ఆన్‌లైన్ వ్యాపారం ప్రారంభించినంత మాత్రాన ఆ సూత్రాలు మీకు అద్భుతంగా అర్థం కావు.
మిమ్మల్ని నిజమైన ధనవంతులుగా చేసేది మీరు ఎంచుకున్న ప్లాట్‌ఫారమ్ కాదు, అది మీ ఆలోచనా విధానం మాత్రమే. మీరు ఇంటర్నెట్‌లో కోర్సులు అమ్ముతున్నా, డిజిటల్ ప్రకటనలు నడుపుతున్నా, లేదా ఒక సరికొత్త ఏఐ (AI) కంపెనీని నిర్మిస్తున్నా సరే, నాకు అనవసరం. డబ్బు అసలు ఎలా పనిచేస్తుందో మీకు ప్రాథమికంగా అర్థం కాకపోతే, మీ చేతిలో ఉన్న డబ్బును మీరు చాలా వేగంగా పోగొట్టుకుంటారు.
కాబట్టి, మీరు ఒక పారిశ్రామికవేత్తగా మారి మార్కెట్లోకి అడుగు పెట్టే ముందు మిమ్మల్ని మీరు కొన్ని కీలకమైన ప్రశ్నలు వేసుకోవాలి. మీకు అసలైన ఆస్తి (asset), అప్పు (liability) మధ్య ఉన్న తేడా తెలుసా? వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన నగదు ప్రవాహం (cash flow) గురించి మీకు పూర్తి అవగాహన ఉందా? అప్పును ఒక పెట్టుబడిగా ఉపయోగించి ఎలా మరింత ధనవంతులు కావాలో మీకు తెలుసా? అలాగే ప్రభుత్వ పన్నుల విధానం ఎలా ఉంటుందో మీకు అవగాహన ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ మీ సమాధానం 'కాదు' అయితే.. దయచేసి వ్యాపారంలోకి దూకకండి. ముందుగా దానికి అవసరమైన ఆర్థిక అవగాహన లేదా విద్యను పొందండి. ఎందుకంటే, ఆర్థిక పరిజ్ఞానం లేకుండా కేవలం డబ్బు సంపాదించడం అనేది లాటరీ గెలవడం లాంటిదే, చివరికి మీరు మళ్లీ ఆర్థికంగా దివాలా తీసి మొదటికొచ్చే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications
