46 పైసలు చెల్లించలేదని రూ.1,200 ఛార్జీలు.. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో చిన్న పొరపాటుకి భారీ షాక్..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో కేవలం 46 పైసల వ్యత్యాసం కారణంగా ఒక వినియోగదారుడికి ఏకంగా రూ. 1,200 కంటే ఎక్కువ ఛార్జీలు విధించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారుడు తనకు వచ్చిన రూ. 10,649.46 బిల్లుకు గాను.. పొరపాటున 46 పైసలు మినహాయించి రూ. 10,649 చెల్లించాడు. అయితే, బకాయిపడిన ఆ అర రూపాయి కంటే తక్కువ మొత్తాన్ని సాకుగా చూపి.. బ్యాంక్ అతనిపై ఆలస్య రుసుములు (Late payment fees), ఇతర ఛార్జీల రూపంలో రూ. 1,200 పైచిలుకు జరిమానా విధించింది.
ఈ అనూహ్య చర్యతో తీవ్ర అసంతృప్తికి గురైన సదరు కస్టమర్, సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను ట్యాగ్ చేస్తూ, ప్రియమైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, మీరు పంపిన బిల్లులో నేను పొరపాటున 46 పైసలు తక్కువగా చెల్లించాను. కేవలం అంత చిన్న మొత్తానికి రూ. 1,200 పైగా ఆలస్య రుసుము విధించడం ఎంతవరకు సమంజసం?" అని ప్రశ్నించారు. అంతేకాకుండా, బ్యాంక్ కస్టమర్ కేర్ ప్రతినిధుల ప్రవర్తనను విమర్శిస్తూ వారు అహంకారంతో, అజ్ఞానంగా వ్యవహరిస్తున్నారని, ఆ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున స్పందనలు వ్యక్తమయ్యాయి. చాలామంది వినియోగదారులు ఆర్‌బిఐ (RBI) నిబంధనలను ప్రస్తావిస్తూ బ్యాంక్ వైఖరిని తప్పుబట్టారు. సాధారణంగా 50 పైసల కంటే తక్కువ ఉన్న మొత్తాన్ని సమీప రూపాయికి రౌండ్ డౌన్ చేస్తారని, 46 పైసలకు జరిమానా విధించడం నిబంధనలకు విరుద్ధమని ఒక నెటిజన్ సూచించారు.
మరికొందరు తమకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ, కార్డ్‌ను రద్దు చేసి కోర్టులో తేల్చుకోవాలని బాధితుడికి సలహా ఇచ్చారు. అయితే, కొద్దిమంది మాత్రం బిల్లును పూర్తిగా చెల్లించకపోవడం కస్టమర్ పొరపాటేనని, డిజిటల్ వ్యవస్థలో నియమాలను తేలికగా తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
