కేంద్రం నుండి రూ.2.5 లక్షల కోట్ల రుణ హామీ పథకం.. కంపెనీ నష్టాలు పాలైతే ప్రభుత్వమే భరిస్తుంది..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న పోరాటం వల్ల భారతీయ వ్యాపార రంగానికి, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) కలగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడం, ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం వంటి పరిణామాల నుండి దేశీయ పారిశ్రామిక రంగాన్ని రక్షించడానికి సుమారు రూ. 2.5 లక్షల కోట్ల రుణ హామీ పథకాన్ని (Credit Guarantee Scheme) ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ ప్రతిపాదిత పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. యుద్ధం వల్ల ఉత్పన్నమయ్యే అనిశ్చితి కారణంగా వ్యాపారాలు తమ రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, ఆ నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దీనివల్ల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు నిర్భయంగా ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ఈ Credit Guarantee Scheme పథకం కింద రూ. 100 కోట్ల వరకు ఉన్న రుణాలపై రుణదాతలకు సుమారు 90% గ్యారెంటీని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

దీనిని ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన 'నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ' (NCGTC) పర్యవేక్షించనుంది. ఇందుకోసం బడ్జెట్ నుండి దాదాపు రూ. 17 వేల కోట్ల నుండి రూ. 18 వేల కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుందని అంచనా. గతంలో కోవిడ్-19 సమయంలో ప్రవేశపెట్టిన అత్యవసర రుణ హామీ పథకం (ECLGS) అద్భుతమైన ఫలితాలను ఇచ్చి, కుప్పకూలుతున్న అనేక పరిశ్రమలను ఆదుకున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మళ్లీ అదే తరహాలో యుద్ధ సంక్షోభం నుండి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మరోవైపు పశ్చిమ ఆసియా ఘర్షణల వల్ల ముడి చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగిన క్రమంలో, సామాన్యులపై, రవాణా రంగంపై భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 26న పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ప్రస్తుతం డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం సున్నాగా ఉండగా, పెట్రోల్‌పై కేవలం రూ. 3కి పరిమితం చేశారు. దేశీయంగా చమురు కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఎగుమతులపై భారీగా సుంకాలు విధించి, దేశీయ మార్కెట్‌లో లభ్యతను పెంచింది. పెట్రో కెమికల్ ఉత్పత్తుల దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపు ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు అవసరమైన ముడి పదార్థాల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంది.
ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక రవాణా మార్గాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల ఎరువులు, సహజ వాయువు, ముడి చమురు దిగుమతులు కష్టతరమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందస్తుగా ఈ ఆర్థిక ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. వ్యాపారస్తులకు రుణాల అందజేతలో ఎలాంటి జాప్యం జరగకుండా, అదనపు మదింపు అవసరం లేకుండానే ప్రస్తుత బకాయిల ఆధారంగానే ముందస్తు ఆమోదిత రుణాలను అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు.
వడ్డీ రేట్లపై పరిమితి విధించడంతో పాటు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా రుణాలు అందజేయడం వల్ల చిన్న వ్యాపారులు ఈ సంక్షోభ కాలంలోనూ తమ కార్యకలాపాలను స్థిరంగా కొనసాగించే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారి తప్పకుండా ఉండేందుకు గట్టి రక్షణ కవచంగా నిలవనున్నాయి.


Click it and Unblock the Notifications