ఆధార్ నంబర్ ఉంటే చాలు.. బ్యాంక్ ఖాతాలోని డబ్బులు తీసేయవచ్చా.. అసలు నిజం ఇదే!
డిజిటల్ విప్లవంలో భాగంగా భారతదేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారిన ఆధార్ కార్డు చుట్టూ అనేక అపోహలు, భయాలు ఉన్నాయి. ముఖ్యంగా కేవలం ఆధార్ నంబర్ తెలిస్తే మన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును మోసగాళ్లు దొంగిలించగలరా?" అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంటుంది. దీనిపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) స్పష్టమైన వివరణనిస్తూ, కేవలం ఆధార్ నంబర్ లేదా దానికి లింక్ అయిన బ్యాంకు వివరాలు తెలిసినంత మాత్రాన ఎవరూ డబ్బును విత్‌డ్రా చేయలేరని తేల్చి చెప్పింది.
బ్యాంకులో డబ్బు తీయడానికి సంతకం లేదా ఏటీఎం పిన్ ఎలా అవసరమో, ఆధార్ ద్వారా లావాదేవీ జరగాలన్నా వేలిముద్ర, కనుపాప స్కాన్ (బయోమెట్రిక్స్) లేదా ఓటీపీ (OTP) ఖచ్చితంగా అవసరమవుతాయి.అయితే, కేవలం నంబర్ వల్ల ప్రమాదం లేకపోయినప్పటికీ.. AePS (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) స్కామ్ ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉంది. ఈ మోసం ఎలా జరుగుతుంది, దీని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఏఈపీఎస్ (AePS) స్కామ్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు డెబిట్ కార్డులు, పిన్ నంబర్లు లేకుండా కేవలం తమ ఆధార్ నంబర్, వేలిముద్రల సహాయంతో మైక్రో-ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం AePS విధానాన్ని తెచ్చింది. మోసగాళ్లు ఈ సౌకర్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు.
డేటా దొంగతనం (వేలిముద్రల క్లోనింగ్): మోసగాళ్లు కేవలం ఆధార్ నంబర్‌తో ఆగకుండా, సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉండే ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల (భూమి క్రయవిక్రయాల డాక్యుమెంట్లు) నుండి ప్రజల వేలిముద్రలను దొంగిలిస్తారు. వాటిని సిలికాన్ లేదా జెల్ సాయంతో నకిలీ వేలిముద్రలుగా (క్లోన్) మారుస్తారు.
నగదు విత్‌డ్రా: ఈ విధంగా సేకరించిన ఆధార్ నంబర్, క్లోన్ చేసిన నకిలీ వేలిముద్రను ఉపయోగించి మైక్రో-ఏటీఎంలు లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద సిస్టమ్‌ను బురిడీ కొట్టిస్తారు.
ఓటీపీ లేని మోసం: ఈ తరహా లావాదేవీలు బయోమెట్రిక్ ఆధారంగా జరుగుతాయి కాబట్టి, బాధితుడి మొబైల్ ఫోన్‌కు ఎలాంటి ముందస్తు ఓటీపీ (OTP) రాదు. నేరుగా ఖాతా నుండి డబ్బు కట్ అయ్యాకే మెసేజ్ వస్తుంది.
మీ ఆధార్ కార్డును సురక్షితంగా ఉంచుకోవడానికి చిట్కాలు : మీ ఆధార్ సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉండాలంటే UIDAI కల్పించిన బయోమెట్రిక్ లాకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గం.
1. బయోమెట్రిక్స్ లాక్ చేయడం ఎలా? : మీరు మీ వేలిముద్రలను లాక్ చేయడం ద్వారా, మీ అనుమతి లేకుండా (మీరు ఆన్‌లైన్ లో అన్‌లాక్ చేసే వరకు) ఎవరూ ఏఈపీఎస్ ద్వారా మీ ఖాతా నుండి రూపాయి కూడా తీయలేరు.
దశ 1: UIDAI అధికారిక వెబ్‌సైట్ (uidai.gov.in) లోకి వెళ్లి మై ఆధార్' (My Aadhaar) సెక్షన్ లోని 'ఆధార్ లాక్/అన్‌లాక్' (Aadhaar Lock/Unlock) ఆప్షన్‌ను ఎంచుకోండి. (లేదా 'm-Aadhaar' యాప్ ఉపయోగించవచ్చు).
దశ 2: మీ ఆధార్ ఐడీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ' (Send OTP)పై క్లిక్ చేయండి.
దశ 3: మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, బయోమెట్రిక్ లాకింగ్ ఫీచర్‌ను ఎనేబుల్' (Enable) చేయండి.
2. పాటించవలసిన అదనపు జాగ్రత్తలు: రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు: బ్యాంకులు లేదా ఏ ప్రభుత్వ సంస్థలు కూడా ఫోన్ చేసి ఓటీపీ (OTP), పిన్ (PIN) లేదా సీవీవీ (CVV) నంబర్లు అడగవు. ఆధార్ లింక్ చేయకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందనే నకిలీ ఫోన్ కాల్స్ వస్తే వెంటనే కట్ చేయండి.
బ్యాంకు ఎస్ఎమ్ఎస్ (SMS) గమనించండి: మీ బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబర్ ఖచ్చితంగా లింక్ ఉండేలా చూసుకోండి. మీ అనుమతి లేకుండా జరిగే ఏఈపీఎస్ విత్‌డ్రాయల్స్ మెసేజ్ రాగానే వెంటనే బ్యాంకును సంప్రదించి అకౌంట్ బ్లాక్ చేయించండి.
ఆస్తి పత్రాల విషయంలో జాగ్రత్త: భూమి లేదా ఇళ్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవసరమైన చోట తప్ప అనవసరంగా ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే, ఆధార్ నంబర్ లోని మొదటి 8 అంకెలు కనిపించకుండా ఉండే 'మాస్క్‌డ్ ఆధార్' (Masked Aadhaar) ను ఉపయోగించడానికి ప్రయత్నించండి.


Click it and Unblock the Notifications
