రోజుల్లో చాలామంది యువతను, మధ్య తరగతి కుటుంబాలను వేధిస్తున్న ప్రధాన ఆర్థిక ప్రశ్న -
"ఇల్లు కొనాలా? లేక అద్దె ఇంట్లో ఉండి అదే డబ్బుతో పెట్టుబడులు పెట్టాలా?" ఈ కన్ఫ్యూషను చార్ట్‌ర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ ఇటీవల X (మాజీగా Twitter) లో చాలా స్పష్టంగా, గణాంకాలతో విశ్లేషించారు.
నితిన్ కౌశిక్ తీసుకున్న ప్రాథమిక ఉదాహరణ: మీ దగ్గర నెలకు ఖర్చు చేయడానికి రూ. 40,000 ఉన్నట్టు ఊహించుకుందాం.

హోం లోన్ తీసుకుని EMI కట్టడం
ఈ ఎంపికలో మీరు సుమారుగా రూ. 50 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తారు. దీని కోసం మీరు బ్యాంకు నుంచి హోం లోన్ తీసుకుంటారు, దీని EMI నెలకు సుమారుగా రూ. 40,000 ఉంటుంది. లోన్ కాలవ్యవధి 20 నుంచి 25 ఏళ్ల వరకూ ఉండవచ్చు. ఈ వ్యవధిలో మీరు మొత్తం చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి సుమారుగా రూ. 80 లక్షల నుంచి రూ. 85 లక్షల వరకూ ఉంటుంది. అయితే, దీని ప్రయోజనం ఏమిటంటే భవిష్యత్తులో ఆ ఇంటి విలువ రూ. 1.2 కోట్ల వరకు పెరిగే అవకాశముంది. అంటే మీకు భద్రతతో పాటు స్థిరమైన ఆస్తి కూడా లభిస్తుంది.
అద్దెకు ఉండడం + మిగిలిన మొత్తాన్ని పెట్టుబడిగా మార్చడం
ఈ ఎంపికలో మీరు నెలకు రూ. 15,000 చెల్లించి అద్దె ఇంట్లో ఉంటారు. మిగిలిన రూ. 25,000ను మీరు ప్రతినెలా SIPల రూపంలో మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులకు సగటున సంవత్సరానికి 12% వృద్ధి రేటు (CAGR) వస్తుందన్న గణనతో చూస్తే, 20 సంవత్సరాల తర్వాత ఈ పెట్టుబడి విలువ సుమారుగా రూ. 2 కోట్లకు పైగా చేరే అవకాశముంది. అంటే, అద్దె జీవితం కొనసాగిస్తూ కూడా మీరు దీర్ఘకాలికంగా భారీ సంపదను నిర్మించుకోవచ్చు.
నితిన్ కౌశిక్ అభిప్రాయం ప్రకారం చాలామంది భావిస్తున్నట్లుగా ఇల్లు కొనడం ఒక పెట్టుబడి కాదు, ఒక రకంగా ఖర్చే అని ఆయన స్పష్టంగా చెప్పారు. హోం లోన్ తీసుకుంటే, మీరు EMI రూపంలో వడ్డీతో కలిపి చాలా ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. దీని వలన మీ డబ్బు పెద్ద మొత్తంలో బ్లాక్ అయిపోతుంది. అదే డబ్బును మీరు సుదీర్ఘకాలిక పెట్టుబడిగా మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టితే, ఇంటి విలువ కంటే ఎక్కువ రాబడి పొందే అవకాశం ఉంటుంది. సొంత ఇల్లు మీకు ఒక స్థిర నివాస భద్రతను ఇస్తుంది, కానీ పెట్టుబడి మాత్రం మీకు దీర్ఘకాలికంగా సంపద (wealth) సృష్టించే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఇంకా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఇల్లు కొనడం మంచి నిర్ణయం కావచ్చు ముఖ్యంగా మీరు ఒకేచోట 15 నుంచి 20 సంవత్సరాలు స్థిరంగా జీవించాలనుకుంటే. హోం లోన్ మీద ట్యాక్స్ ప్రయోజనాలు పొందాలన్న ఉద్దేశంతోనైనా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, మీరు భద్రతను ప్రాధాన్యతగా భావించి, ఫైనాన్షియల్ సెక్యూరిటీకి ఎక్కువ విలువ ఇస్తే, సొంత ఇల్లు మంచిదే.
అయితే, అద్దెకు ఉండడం + పెట్టుబడి చేయడంలోనూ ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మీరు ఆర్థిక క్రమశిక్షణతో నెలవారీ పెట్టుబడి కొనసాగించగలిగితే అవసరమైనప్పుడు స్థలమార్పు చేయాలన్న పరిస్థితే వచ్చినా, అద్దె జీవితం నుంచి తేలికగా మారగలగడం వీలవుతుంది. ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభంలో ఉద్యోగ మార్పులు, నగర మార్పులు సాధారణం. హోం లోన్ తీసుకుంటే ఈ మొబిలిటీ తగ్గిపోతుంది. అద్దె ఇంట్లో ఉంటే మారడం సులభం.
ఈ రెండు ఎంపికల్లో ఏదీ తప్పు కాదు కానీ మీరు ఇవ్వని ఆలోచించుకోవాలి. మీ జీవిత లక్ష్యాల ప్రకారం, మీరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారో దాన్ని బట్టి మీ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మీ నిర్ణయాన్ని తీసుకోవాలి. చివరకి మీరు ఇంట్లో బతకాలి గానీ, ఇంటి కోసమే బతకకూడదు.


Click it and Unblock the Notifications