కొత్త సంవత్సరం 2022లో మరోసారి కొన్ని ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రిజ్, వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండిషనర్లు, బిస్కట్లు, వంట నూనెలు, కార్లు, మోటార్ బైక్స్.. ఇలా పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిత్యావసరాల నుండి గృహోపకరణాల వరకు వివిధ ఉత్పత్తుల సంస్థలు వచ్చే ఏడాది నుండి ధరలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు ఉత్పత్తుల ధరలు కరోనా కారణంగా ఈ ఏడాది ఒకటికి రెండుసార్లు పెరిగాయి. ఇప్పుడు 2022లో మరోసారి పెంపుకు సిద్ధం అవుతున్నాయి. ఇన్‌పుట్ వ్యయం, రవాణా భారం, సప్లై చైన్ సమస్యలు కార్పోరేట్ సంస్థల లాభాలకు గండి కొడుతున్నాయి. దీంతో లాభాలను అందిపుచ్చుకునేందుకు ధరలు పెంచడానికి సన్నద్ధమయ్యాయి.

ఆటో రంగం
ఆటో రంగం విషయానికి వస్తే హీరో మోటో కార్ప్ జనవరి 4వ తేదీ నుండి టూ-వీలర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని బైక్స్ పైన ధర రూ.2000 వరకు పెరగనుంది. ముడి పదార్థాల వ్యయాలు పెరిగినందున ధరలు పెంచవలసి వస్తుందని తెలిపింది. మోడల్, మార్కెట్ ఆధారంగా ఒక్కో మోడల్ పైన ఒక్కో విధంగా ధరలు పెరుగుతున్నట్లు తెలిపింది.
ఫోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ తమ పోలో, వెంటో, టైగాన్ ధరలను జనవరి 1వ తేదీ నుండి రెండు శాతం నుండి ఐదు శాతం పెంచనున్నట్లు తెలిపింది.
మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, హోండా కార్స్, స్కోడా సంస్థలు కూడా జనవరి నుండి ధరలు పెంచుతున్నట్లు తెలిపాయి.

ఈవీవీ ధరలు పెరిగే ఛాన్స్
కరోనా కారణంగా భారత్ ఆటో రంగం తీవ్ర సంక్షోభంలో కొనసాగుతోంది. వాహన విక్రయాలు పెరిగినప్పటికీ, ముడి పదార్థాల వ్యయాలు పెరగడం, ఇన్నాళ్లు సేల్స్ లేకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. సంప్రదాయ ఇంధనతో నడిచే వాహనాలను తయారీ చేసే సంస్థలు సెమీ కండక్టర్ల కొరతతో సతమతమవుతున్నాయి. మరోవైపు ఈవీ తయారీ కంపెనీలు లిథియం-అయాన్ బ్యాటరీల కొరతను ఎదుర్కొంటున్నాయి. బ్యాటరీల తయారీలో వినియోగించే ప్రధాన లోహాలు లిథియం, నికెల్, కోబాల్డ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అవాంతరాలు ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. 2021 ప్రారంభం నుండి ప్రతి త్రైమాసికంలో ధరలు పెరుగుతున్నాయని, బ్యాటరీల్లో ఉండే సెల్స్ ధర 30 శాతం పెరిగిందని అంటున్నారు. బ్యాటరీల తయారీకి అయ్యే ఖర్చులో 70 శాతం ఈ సెల్స్ కోసం వెచ్చించాలి. దేశంలో EVలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎఫ్ఎంసీజీలు ధరల పెంపు
ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే మూడు నెలల్లో నాలుగు శాతం నుండి పది శాతం ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాబర్ సంస్థ ఇప్పటికే నాలుగు శాతం పెంచింది. మరోసారి కూడా పెంచే సంకేతాలిచ్చింది. ద్రవ్యోల్భణం పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని డాబర్ చెబుతోంది. హిందూస్తాన్ యూనీలీవర్, బ్రిటానియా, మారికో సంస్థలు కూడా గత రెండు త్రైమాసికాల్లో ధరలను ఐదు శాతం నుండి 12 శాతం పెంచాయి. మరిన్ని సంస్థలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫ్రిజ్ టు వాషింగ్ మెషీన్
ఫ్రిజ్, వాషింగ్ మిషన్లు, ఏసీ వంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు కూడా ధరలను మూడు నుండి ఐదు శాతం పెంచాయి. వచ్చే నెలలో మరో ఆరు శాతం నుండి పది శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020 డిసెంబర్ నుండి ఈ కంపెనీలు ధరలు పెంచడం నాలుగోసారి. స్టీల్, బొగ్గు ఇతర ముడి సరుకు ధరలు పెరగడం వల్ల ఆటో మొబైల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications