Home Loans: ఆర్బీఐ రెపో రేటు పెంపు తర్వాత తక్కువ వడ్డీకే హోం లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 5.25 శాతం నుంచి 5.50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ రేటు పెంపుతో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR)తో అనుసంధానించిన గృహ రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. అయితే బ్యాంకులు EBLR-అనుసంధానించిన రుణాలపై వడ్డీ రేట్లను పెంచడానికి ముందే, మీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్న తక్కువ వడ్డీ రేట్లకే ఇంటిని కొనుగోలు చేసే అవకాశాన్ని పొందవచ్చు. రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు గృహ రుణాలపై ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు) అందిస్తున్న అత్యల్ప వడ్డీ రేట్లు తెలుకుందాం.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యల్పంగా 7 శాతం వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.10 శాతం, ఇండియన్ బ్యాంక్ 7.15 శాతం, యూకో బ్యాంక్ 7.15 శాతం, యూనియన్ బ్యాంక్ ఇండియా 7.15 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.20 శాతం, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు 7.20 శాతం చొప్పున హోం లోన్లు అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 శాతం వడ్డీతో గృహ రుణం అందిస్తోంది. ప్రైవేట్ రంగ బ్యాంకులలో సౌత్ ఇండియన్ బ్యాంక్ అత్యల్పంగా 7.25% వడ్డీ రేటును అందిస్తుండగా, ఫెడరల్ బ్యాంక్ 7.35% రేటుతో తర్వాతి స్థానంలో ఉంది.

HSBC బ్యాంక్ 7.45 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా..కర్ణాటక బ్యాంక్ 7.48 శాతం, ICICI బ్యాంక్ వడ్డీ రేటు 7.55 శాతం వడ్డీతో హోం లోన్లు ఇస్తున్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో LIC హౌసింగ్ ఫైనాన్స్ అత్యల్పంగా 7.15 శాతం వడ్డీతో గృహ రుణం అందిస్తోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ. 30 లక్షల నుండి రూ. 75 లక్షల మధ్య రుణాలపై 7.25% రేటును అందిస్తోంది. హోం లోన్ తీసుకున్న వారు ఈఎంఐ చెల్లిస్తారు. EMI అంటే 'ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్' (సమాన నెలవారీ వాయిదా). ఇందులో అసలు మొత్తం తిరిగి చెల్లించడం, గృహ రుణ బకాయిపై వడ్డీ చెల్లించడం వంటివి ఉంటాయి.
రుణగ్రహీతకు వర్తించే వడ్డీ రేటును నిర్ణయించేటప్పుడు బ్యాంకులు ఆదాయం, రుణ మొత్తం, తిరిగి చెల్లించే కాలపరిమితి, ఉద్యోగ వివరాలు, ఇప్పటికే ఉన్న ఆర్థిక బాధ్యతలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. కాబట్టి బ్యాంక్ ప్రకటించిన వడ్డీ రేటు ప్రతి గృహ రుణ దరఖాస్తుదారుడికి వర్తించకపోవచ్చు. ఇక బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుంచి డబ్బును అప్పుగా తీసుకునే రేటు రెపో రేటు కాబట్టి, ఇది గృహ రుణాల రేట్లను ప్రభావితం చేస్తుంది. ఆర్‌బిఐ రెపో రేటును పెంచినప్పుడు, బ్యాంకులు దాని నుంచి అధిక రేటుకు రుణాలు పొందుతాయి. బ్యాంకులు ఈ అధిక-రేటు రుణాలపై ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తాయి కాబట్టి, గృహ రుణాల వంటి ఈబీఎల్‌ఆర్-అనుసంధానిత రుణాలపై వడ్డీ రేట్లను పెంచడం ద్వారా, పెరిగిన ఖర్చులను తమ రుణగ్రహీతలకు బదిలీ చేస్తాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications