atal pension yojana అలర్ట్: జూలై 1 నుండి ఆటో డెబిట్, అప్పటి దాకా జరిమానా లేదు
అసంఘటిత రంగాలలోని కార్మికులకు పెన్షన్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన(APY) పథకాన్ని ప్రకటించింది. పేద కార్మికులకు ఉద్యోగ విరమణ అనంతరం వారి వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కోసం ఈ పథకాన్ని 2015-16 బడ్జెట్‌లో ప్రవేశ పెట్టారు. ఇందులో చేరిన వారు నిర్ణీత సమయంలో చెల్లించిన మొత్తానికి పెన్షన్ అందిస్తారు.
ఈ పథకం కింద రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 మొత్తాన్ని 18 ఏళ్ల వయస్సు నుండి 40 ఏళ్ల వయస్సు మధ్య చేరడం ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం లబ్ధిదారుల ఖాతాల నుండి ప్రతి నెల మొత్తాలను బ్యాంకులు ఆటో-డెబిట్ ద్వారా తీసుకోనున్నాయి.

జూలై 1 నుండి ఆటో డెబిట్ తిరిగి ప్రారంభం
జూలై 1వ తేదీ నుంచి అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల నుంచి నెలవారీ విరాళాలు ఆటో డెబిట్ కానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్యాంకు ఖాతాల నుండి ఆటో డెబిట్ కావడాన్ని నిలిపివేయాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) ఏప్రిల్ 11వ తేదీన బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30వ తేదీ వరకు దీనిని నిలిపి వేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో జూలై 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభం కానుంది.

అప్పటి వరకు జరిమానా లేదని ఊరట
ఈ మేరకు ఆటో డెబిట్ జూలై 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభమవుతుందని ఈ స్కీం సబ్‌స్క్రైబర్లకు పంపిన ఈ మెయిల్‌లో PFRDA తెలిపింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా పెన్షన్ స్కీం అకౌంట్‌ను ఖాతాను పునరుద్ధరించుకుంటే అపరాధ రుసుం ఉండదని కూడా స్పష్టం చేసింది. సాధారణంగా ఆలస్యమైన నెలసరి మొత్తాలపై బ్యాంకులు జరిమానాలను విధిస్తాయి. అయితే ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 వరకు ఖాతాలను రెగ్యులరైజ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అప్పటి వరకు జరిమానాలు ఉండవు.

జరిమానా ఇలా...
సాధారణంగా ఆలస్యమైతే బ్యాంకులు జరిమానా విధిస్తాయి. నెలకు రూ.100 కాంట్రిబ్యూషన్ పైన రూ.1, నెలకు రూ.101 నుండి రూ.500 వరకు రూ.2, నెలకు రూ.501 నుండి రూ.1,000 వరకు రూ.5, రూ.1,001 నుండి అంతకుమించితే రూ.10 జరిమానా విధిస్తుంది. ఈసారి ఆ జరిమానా సెప్టెంబర్ 30వ తేదీ వరకు లేదు.
18 ఏళ్ల వయస్సు నుండి 40 ఏళ్ల వయస్సు లోపు వారు ఈ పథకంలో చేరవచ్చు. బ్యాంకు ఖాతా తప్పనిసరి. రూ.1,000 నుండి రూ.5,000 వరకు నెల నెల పెన్షన్ పొందవచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ అందుకుంటారు. మనం చెల్లించే నెలసరి మొత్తాలపై భవిష్యత్తులో వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications