SBI ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా, సెప్టెంబర్ 18 నుండి కొత్త రూల్... తెలుసుకోండి
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఏటీఎంలో డబ్బులు ఉపసంహరించే కస్టమర్లకు అలర్ట్. రూ.10,000, అంతకంటే ఎక్కువ విత్‌డ్రా చేసే కస్టమర్లకు ఓటీపీ ఆధారిత ఉపసంహరణ సేవలను ఈ నేల 18వ తేదీ నుండి రౌండ్-ది-క్లాక్ అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఎస్బీఐ ఈ ఏడాది జవరి నెలలో ఓటీపీ ఆధారిత ఉపసంహరణను అందుబాటులోకి తెచ్చింది. అయితే అన్ని ఏటీఎంలలో ఈ వెసులుబాటును రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం, 18వ తేదీ నుండి నిత్యం (24x7) అందుబాటులోకి తెస్తోంది.

ఓటీపీఆధారిత నగదుతో... ఎస్బీఐ ప్రకటన
24x7 OTP ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో ఏటీఎంలో నగదు ఉపసంహరణలో భద్రతాస్థాయిని మరింత బలోపేతం చేసిందని, రోజంతా ఈ సదుపాయాన్ని అమలు చేయడంవల్ల ఎస్బీఐ డెబిట్ కార్డుదారులు... మోసగాళ్ల నుండి, అనధికార ఉసంహరణల నుండి, కార్డ్ స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్‌కు గురయ్యే ప్రమాదాల నుండి నిరోధించవచ్చునని ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఎటీఎం కేంద్రాల వద్ద మోసాలు, కార్డు క్లోనింగ్ సహా ఇతర ఫ్రాడ్స్ తగ్గించేందుకు ఈ సెక్యూరిటీ సిస్టంను అమలు చేస్తోంది ఎస్బీఐ. అయితే ఇప్పటి వరకు రాత్రి సమయానికే పరిమితమైన ఓటీపీ ఆధారిత ఉపసంహరణ ఇప్పుడు, రోజంతా ఉండనుంది.

రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ
ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే ముందుగా ఏటీఎంలో కార్డును స్వైప్ చేయాలి. రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం తీసుకోవడానికి నెంబర్ ఎంటర్ చేస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. ఏటీఎం స్క్రీన్‌పై OTP విండో ఓపెన్ అవుతుంది. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని అందులో ఎంటర్ చేయాలి. సరైన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా అవుతాయి. పదివేల రూపాయల లోపు విత్ డ్రాకు ఓటీపీ అవసరం లేదు.

ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే
ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే ఉంది. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్(NFS) ఎస్బీయేతర ఏటీఎంలలో ఈ ఫంక్షన్‌ను డెవలప్ చేయనందున, ఓటీపీ ఆధారిత సేవలు కేవలం ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే ఉన్నాయి. ఎస్బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టీ మాట్లాడుతూ.. సాంకేతిక మెరుగుదల, భద్రతాస్థాయిని పెంచడం ద్వారా తన కస్టమర్లకు భద్రతను, సౌకర్యాలను పెంచడంలో ఎస్బీఐ ఎప్పుడూ ముందు ఉన్నదని చెప్పారు. 24x7 OTP ఆధారిత సేవలు కస్టమర్లకు సురక్షిత, ప్రమాదరహిత నగదు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు.


Click it and Unblock the Notifications