Atal pension yojana:అటల్ పెన్షన్ యోజన.. ఏ వయసులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? పూర్తి ఛార్ట
వృద్ధాప్యంలో ఎవరి మీద ఆధారపడకుండా, గౌరవంగా బతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారు, ప్రైవేట్ ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే అటల్ పెన్షన్ యోజన (atal pension yojana) (APY). ఈ పథకంలో మీరు చేరితే, 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా నిర్ణీత పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. 1000 రూపాయల నుండి 5000 రూపాయల వరకు మీకు నచ్చిన పెన్షన్ అమౌంట్‌ను మీరు ఎంచుకోవచ్చు.

ఎవరు చేరవచ్చు?
ఈ పథకంలో చేరడానికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్ట వయస్సు 40 ఏళ్లు. అంటే మీరు కనీసం 20 ఏళ్ల పాటు ఈ పథకంలో చందాదారుడిగా ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే, 2022 నుండి అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం, ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించే వారు ఈ పథకంలో చేరడానికి వీలులేదు. కేవలం సామాన్యులు, పేదలు , మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఒక వరమని చెప్పవచ్చు.
ఏ వయసులో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? (రూ. 5000 పెన్షన్ కోసం)
మీరు ఎంచుకున్న పెన్షన్ అమౌంట్ , మీ వయస్సును బట్టి మీరు కట్టాల్సిన నెలవారీ ప్రీమియం మారుతుంది. రూ. 5000 పెన్షన్ కావాలనుకుంటే..
- 18 ఏళ్ల వయసులో చేరితే: నెలకు కేవలం రూ. 210 చెల్లిస్తే సరిపోతుంది.
- 25 ఏళ్ల వయసులో చేరితే: నెలకు రూ. 376 చెల్లించాల్సి ఉంటుంది.
- 30 ఏళ్ల వయసులో చేరితే: నెలకు రూ. 577 కట్టాలి.
- 35 ఏళ్ల వయసులో చేరితే: నెలకు రూ. 902 చెల్లించాల్సి ఉంటుంది.
- 40 ఏళ్ల వయసులో చేరితే: నెలకు రూ. 1,454 చెల్లించాలి.
అంటే, మీరు ఎంత త్వరగా ఈ పథకంలో చేరితే, మీరు కట్టాల్సిన నెలవారీ మొత్తం అంత తక్కువగా ఉంటుంది.
పథకం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు
ఈ పథకం కేవలం మీకు పెన్షన్ ఇవ్వడమే కాకుండా, మీ కుటుంబానికి కూడా భరోసా ఇస్తుంది..
- భార్య/భర్తకు పెన్షన్: ఒకవేళ చందాదారుడు మరణిస్తే, అదే పెన్షన్ అమౌంట్ వారి జీవిత భాగస్వామికి (Spouse) అందుతుంది.
- నామినీకి పూర్తి నగదు: దంపతులిద్దరూ మరణించిన పక్షంలో, అప్పటి వరకు జమ అయిన మొత్తం నగదును నామినీకి అప్పగిస్తారు.
- ఆటో డెబిట్ సౌకర్యం: మీ బ్యాంక్ అకౌంట్ నుండి ప్రతి నెలా ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల వాయిదాలు మర్చిపోయే అవకాశం ఉండదు.
ఎలా అప్లై చేయాలి?
మీకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్న ఏ బ్యాంకులోనైనా లేదా పోస్ట్ ఆఫీస్‌లోనైనా అటల్ పెన్షన్ యోజన (atal pension yojana) అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు చాలా బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ ఉంటే నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది వయసు అయిపోయాక చేసేది కాదు, సంపాదన మొదలైనప్పుడే చేయాల్సింది. అందుకే తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ఈ రోజే ఒక నిర్ణయం తీసుకోండి!


Click it and Unblock the Notifications