ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలో చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే!
ప్రతి ఒక్కరి జీవితంలో ఒకానొక దశలో "నేను ఇక పని చేయకుండా హాయిగా బ్రతకగలనా?" అనే ప్రశ్న ఎదురవుతుంది. దీనినే మనం ఆర్థిక స్వాతంత్ర్యం లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ (Financial freedom) అని పిలుస్తాం. అయితే మనకు ఎంత డబ్బు ఉంటే జీవితాంతం భరోసాగా ఉండవచ్చో లెక్కించడం చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అటువంటి వారి కోసం ఆర్థిక నిపుణులు '33x రూల్' అనే సులభమైన పద్ధతిని సూచిస్తున్నారు. కేవలం రెండు నిమిషాల్లో మీ ఆర్థిక లక్ష్యాన్ని ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. అదెలాగంటే..

అసలు ఏమిటీ '33x రూల్'?
ప్రముఖ అమెరికన్ ఫైనాన్షియల్ ప్లానర్ విలియం బెంగెన్ ప్రతిపాదించిన '4% సేఫ్ విత్ డ్రాయల్ రేట్' ఆధారంగా ఈ 33x సూత్రం రూపొందించబడింది. సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు నుండి ఏటా 4% డబ్బును వాడుకుంటే, ఆ నిధి కొన్ని దశాబ్దాల పాటు వస్తుందని ఆయన పరిశోధనలో తేలింది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం (Inflation) , మార్కెట్ ఒడిదుడుకులను దృష్టిలో ఉంచుకుని, ఈ విత్ డ్రాయల్ రేటును 3%కి తగ్గించి '33x రూల్' ను తీసుకువచ్చారు. అంటే మీ వార్షిక ఖర్చులను 33 తో గుణిస్తే వచ్చే మొత్తమే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టార్గెట్.
ఈ లెక్క ఎలా వేయాలో చూడండి..
మీరు ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నారో ముందుగా లెక్కించండి. ఆ మొత్తాన్ని 33తో గుణించండి.
- ఉదాహరణ 1: మీ వార్షిక ఖర్చులు రూ.10 లక్షలు అనుకుంటే.. 10 లక్షలు x 33 = రూ.3.3 కోట్లు. అంటే మీ దగ్గర రూ.3.3 కోట్ల పెట్టుబడి ఉంటే మీరు పని చేయకపోయినా హాయిగా జీవించవచ్చు.
- ఉదాహరణ 2: ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాదికి రూ.6 లక్షలు ఖర్చు చేస్తే.. వారికి రూ.1.98 కోట్లు (సుమారు రూ.2 కోట్లు) అవసరం.
- ఉదాహరణ 3: ఒక యువ ప్రొఫెషనల్ వార్షిక ఖర్చు రూ.4 లక్షలు అయితే, అతను రూ.1.32 కోట్లు పోగు చేయగలిగితే ఆర్థిక స్వేచ్ఛ పొందినట్లే.
జాగ్రత్తలు తప్పనిసరి
ఈ '33x రూల్' అనేది మన ఆర్థిక పరిస్థితిపై ఒక ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇది మార్కెట్ స్థిరంగా ఉంటుందని, మీ ఖర్చులు పెరగవని ఊహిస్తుంది. కానీ నిజ జీవితంలో అనారోగ్య సమస్యలు, అత్యవసర ఖర్చులు లేదా ధరల పెరుగుదల వంటి సవాళ్లు ఎదురవుతాయి. అందుకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ (Financial freedom) సాధించాలనుకునే వారు కేవలం ఈ సూత్రంపైనే ఆధారపడకుండా, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించి పక్కా ప్లాన్ రూపొందించుకోవడం మంచిది. మీ ప్రస్తుత ఆదాయం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెడితేనే సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది.


Click it and Unblock the Notifications