Insurance claim: వాహన ప్రమాదం తర్వాత ఇన్సూరెన్స్ క్లైమ్ ఎలా పొందాలి? ఇదిగో పూర్తి వివరాలు!
రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. మన దేశంలో ప్రతిరోజూ సగటున 1,300 పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టంతో పాటు ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బ తగులుతుంది. ఆ సమయంలో మనల్ని ఆదుకునేదే బీమా (Insurance).. అయితే, చాలామందికి ప్రమాదం జరిగిన తర్వాత క్లేమ్ ఎలా చేయాలో, ఏయే పత్రాలు అవసరమో తెలియదు. అందుకే ఈ సులభమైన గైడ్ మీ కోసం!

ఏ చట్టం మనల్ని కాపాడుతుంది?
మన దేశంలో 'మోటార్ వాహన చట్టం 1988' ప్రకారం రోడ్డు ప్రమాద బాధితులకు హక్కులు ఉన్నాయి. ముఖ్యంగా సెక్షన్ 166 కింద మనం పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా చనిపోయినా లేదా తీవ్రంగా గాయపడినా, సెక్షన్ 164 కింద 'నో ఫాల్ట్ లయబిలిటీ' (తప్పు ఎవరిదైనా సరే) ద్వారా తక్షణ పరిహారం పొందే అవకాశం ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే ఏం చేయాలి?
ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా ఈ పనులు వరుసగా చేయండి..
- భద్రత ముఖ్యం: ముందుగా క్షతగాత్రులకు వైద్య సహాయం అందించండి.
- పోలీసులకు సమాచారం: ప్రమాదం పెద్దదైతే లేదా వేరే వ్యక్తికి నష్టం వాటిల్లితే వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేయండి.
- ఆధారాలు సేకరించండి: ప్రమాద స్థలాన్ని, దెబ్బతిన్న వాహనాలను ఫోటోలు లేదా వీడియోలు తీయండి. సాక్షులు ఎవరైనా ఉంటే వారి వివరాలు తీసుకోండి. ఇవి మీ క్లేమ్ బలపడటానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
కంపెనీకి ఎప్పుడు చెప్పాలి?
చాలామంది చేసే తప్పు ఇదే. ప్రమాదం జరిగిన 24 నుంచి 48 గంటల్లోపు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. ఆలస్యం చేస్తే మీ క్లేమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి క్లేమ్ నంబర్ తీసుకోండి.
అవసరమైన పత్రాలు (Documents)
క్లేమ్ సెటిల్ అవ్వాలంటే ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి..
1. ఇన్సూరెన్స్ పాలసీ కాపీ
2. వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)
3. డ్రైవింగ్ లైసెన్స్ (DL)
4. FIR కాపీ (అవసరమైతే)
5. రిపేరింగ్ బిల్లులు లేదా ఎస్టిమేషన్ కాపీ
సర్వేయర్ తనిఖీ
మీరు క్లేమ్ నమోదు చేసిన తర్వాత కంపెనీ ఒక 'సర్వేయర్'ను పంపుతుంది. అతను వచ్చి మీ వాహనానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాడు. గుర్తుంచుకోండి: సర్వేయర్ వచ్చి వాహనాన్ని చూసే వరకు రిపేర్లు మొదలు పెట్టకండి. అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే నెట్‌వర్క్ గ్యారేజీలో రిపేర్ చేయించి బిల్లులు జాగ్రత్తగా ఉంచుకోండి.
క్లైమ్ ఎప్పుడు రాదు? (జాగ్రత్త!)
కింది సందర్భాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు క్లేమ్ ఇవ్వవు..
- మద్యం తాగి డ్రైవింగ్ చేయడం (ఇది చాలా ముఖ్యం, ఇక్కడ ఎలాంటి పరిహారం రాదు).
- చెల్లుబాటులో లేని (Invalid) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం.
- ఇన్సూరెన్స్ కంపెనీకి చాలా ఆలస్యంగా సమాచారం ఇవ్వడం.
- కంపెనీకి తప్పుడు సమాచారం లేదా ఆధారాలు ఇవ్వడం.
ఒకవేళ మీ క్లేమ్ సక్రమంగా ఉన్నా కంపెనీ రిజెక్ట్ చేస్తే, మీరు 'బీమా లోక్ పాల్' (Insurance Ombudsman) లేదా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించవచ్చు. సరైన అవగాహన ఉంటే ఇన్సూరెన్స్ క్లైమ్ (Insurance claim)పొందడం పెద్ద కష్టమేమీ కాదు.


Click it and Unblock the Notifications