జీతం రాగానే ఖాళీ అవుతోందా? ఈ సింపుల్ ఫార్ములాతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాపాడుకోండి!
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే సమస్య.. నెల మొదట్లో జీతం పడగానే మొబైల్‌కు వచ్చే క్రెడిట్ మెసేజ్ చూసి మురిసిపోయే లోపే, వరుసగా డెబిట్ మెసేజ్‌లు మొదలవుతాయి. అద్దె, EMI, కరెంట్ బిల్లులు, పిల్లల ఫీజులు.. ఇలా అన్నీ పోగా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. సంపాదించడం ఎంత ముఖ్యమో, ఆ డబ్బును మేనేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆర్థిక నిపుణులు "50-30-20 రూల్" అనే ఒక అద్భుతమైన ఫార్ములాను సూచిస్తున్నారు.

అసలేంటి ఈ 50-30-20 రూల్?
మీ చేతికి వచ్చే నికర జీతాన్ని (ట్యాక్స్ కటింగ్‌లు పోగా) మూడు భాగాలుగా విభజించడమే ఈ సూత్రం..
- 50% అవసరాలు (Needs): మీ జీతంలో సగం భాగాన్ని అద్దె, సరుకులు, బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు , EMI ల కోసం కేటాయించాలి.
- 30% కోరికలు (Wants): మిగిలిన 30 శాతాన్ని మీ లైఫ్‌స్టైల్ కోసం, అంటే బయట తిండి, సినిమాలు, షాపింగ్ , పర్యటనల కోసం వాడుకోవచ్చు.
- 20% పొదుపు (Savings): కనీసం 20 శాతం డబ్బును పొదుపు , పెట్టుబడుల కోసం పక్కన పెట్టాలి.
అద్దె , EMI ఎంత ఉండాలి?
చాలా మంది తమ జీతంలో సగానికి పైగా కేవలం అద్దె లేదా EMI లకే ఖర్చు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం.
- అద్దె: మీ జీతంలో అద్దె 25% నుండి 30% మించకుండా చూసుకోవాలి. ఉదాహరణకు మీకు లక్ష రూపాయల జీతం వస్తే, మీ అద్దె రూ. 30 వేల లోపే ఉండాలి.
- EMI: హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఏదైనా సరే, మీ మొత్తం EMI లు జీతంలో 30% నుండి 40% లోపే ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉంటే, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీరు ఆర్థికంగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.
SIP - మీ సంపదను పెంచే మార్గం!
డబ్బును కేవలం బీరువాలో దాస్తే పెరగదు, అది పెట్టుబడిగా మారాలి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం వల్ల 'కాంపౌండింగ్' మ్యాజిక్ జరుగుతుంది. 25 ఏళ్ల వయసులో నెలకు రూ. 5,000 తో ప్రారంభించి, క్రమం తప్పకుండా పెట్టుబడి పెంచితే, రిటైర్మెంట్ నాటికి మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం.
ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్
కేవలం పెట్టుబడులు పెడితే సరిపోదు, భద్రత కూడా ముఖ్యం. మీ కుటుంబం కోసం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ , మీ ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కచ్చితంగా ఉండాలి. అలాగే, కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును 'ఎమర్జెన్సీ ఫండ్' గా ఒక సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకోవాలి. దీనివల్ల ఉద్యోగం పోయినా లేదా ఏదైనా అనారోగ్యం వచ్చినా టెన్షన్ ఉండదు.
జీతం పెరిగితే ఖర్చు పెంచకండి!
సాధారణంగా జీతం పెరగగానే మనం ఖరీదైన ఫోన్లు, కార్లు కొనేస్తుంటాం. దీనిని "లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్" అంటారు. జీతం పెరిగినప్పుడు, దానికి అనుగుణంగా మీ SIP మొత్తాన్ని కూడా పెంచండి. మీ పెట్టుబడులు ఆటో-డెబిట్ మోడ్‌లో ఉంటే, మీరు మర్చిపోయినా మీ సంపద పెరుగుతూనే ఉంటుంది.
చివరగా, ఈ 50-30-20 ఫార్ములా చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, దీనిని కచ్చితంగా పాటిస్తే మీ ఆర్థిక ఒత్తిడి తగ్గి, భవిష్యత్తులో మీరు ఆర్థిక స్వాతంత్య్రాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications