మీ లోన్ భారం త్వరగా తగ్గించుకోవాలా? ఈ 3 స్మార్ట్ టిప్స్ పాటిస్తే లక్షల రూపాయల ఆదా!
అప్పు చేయడం ఈ రోజుల్లో చాలా సులభం అయిపోయింది. కానీ, ఆ అప్పును తిరిగి చెల్లించడమే పెద్ద సవాలుగా మారింది. హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ ఏదైనా సరే.. ఏళ్ల తరబడి EMIలు కట్టడం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. అయితే కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటిస్తే మీరు నిర్ణీత సమయం కంటే ముందే మీ రుణ విముక్తి పొందవచ్చు. అదెలాగంటే..

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. కానీ, లోన్ తీసుకున్న తర్వాత అసలు కంటే వడ్డీయే ఎక్కువగా కడుతున్నామని చాలా మంది బాధపడుతుంటారు. ముఖ్యంగా హోమ్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాల్లో మన కట్టే వడ్డీ అసలు కంటే రెట్టింపు ఉంటుంది. మీరు కూడా మీ రుణాన్ని వేగంగా పూర్తి చేసి, వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ లోన్ రీపేమెంట్ (loan prepayment) , ఇతర స్మార్ట్ పద్ధతులు మీకు ఎంతో ఉపయోగపడతాయి.
1. లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (Balance Transfer)
మీరు ఒక బ్యాంకులో ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకున్నారని తర్వాత తెలిస్తే, కంగారు పడక్కర్లేదు. తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే మరో బ్యాంకుకు మీ లోన్‌ను మార్చుకోవచ్చు. దీనినే 'బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' అంటారు. అయితే ఇది లోన్ తీసుకున్న మొదటి రెండు లేదా మూడు ఏళ్లలో చేస్తేనే ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే ప్రారంభంలోనే మనం కట్టే EMIలో ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. అయితే, కొత్త బ్యాంకులో ప్రాసెసింగ్ ఫీజు ఇతర ఛార్జీలను లెక్కవేసుకుని వడ్డీ రేటులో కనీసం 0.5% నుండి 1% వ్యత్యాసం ఉంటేనే దీనికి వెళ్లడం ఉత్తమం.
2. అదనపు చెల్లింపులు (Pre payment)
మీ జీతం పెరిగినప్పుడు లేదా బోనస్ వచ్చినప్పుడు ఆ డబ్బుతో విలాసాలకు వెళ్లకుండా కొంత మొత్తాన్ని లోన్ 'ప్రిన్సిపల్' (అసలు) కింద కట్టేయండి. మీరు ప్రతి ఏడాది అదనంగా కేవలం ఒకే ఒక EMIని కడితే మీ 20 ఏళ్ల హోమ్ లోన్ కాలపరిమితి దాదాపు 3 నుండి 4 ఏళ్లు తగ్గుతుంది. వడ్డీపై లెక్కలేనంత డబ్బు ఆదా అవుతుంది. మీ దగ్గర ఉన్న చిన్న మొత్తాలను కూడా లోన్ అకౌంట్లో జమ చేయడం వల్ల అసలు తగ్గి, దానిపై పడే వడ్డీ భారం కూడా తగ్గుతుంది.
3. రెపో రేటు తగ్గినా EMI తగ్గించవద్దు!
2025లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను పలుమార్లు తగ్గించింది. దీనివల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. సాధారణంగా వడ్డీ రేటు తగ్గితే బ్యాంకులు మీ EMI మొత్తాన్ని తగ్గిస్తాయి. కానీ మీరు బ్యాంకును సంప్రదించి "నా EMI అలాగే ఉంచి, లోన్ టెన్యూర్ (కాలపరిమితి) తగ్గించండి" అని కోరండి. దీనివల్ల మీ నెలవారీ ఖర్చులో మార్పు ఉండదు కానీ, మీ లోన్ అనుకున్న సమయం కంటే చాలా ముందే పూర్తవుతుంది.
ఏదేమైనా అప్పుల నుంచి త్వరగా బయటపడటం అంటే ఆర్థిక స్వేచ్ఛను పొందడమే. పైన చెప్పిన లోన్ రీపేమెంట్ (loan prepayment) పద్ధతులు పాటించేటప్పుడు మీ ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) ను ముట్టుకోకుండా చూసుకోండి. సరైన ప్లానింగ్ ఉంటే ఏ అప్పైనా చిటికెలో తీర్చేయవచ్చు.


Click it and Unblock the Notifications