పండుగ సీజన్‌లో చాలామంది బంగారం కొనుగోలు చేస్తారు. ధన్‌తెరాస్ రోజు అయితే పసిడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇటీవల బంగారం ధర భారీగా పెరగడంతో కొద్ది రోజులుగా డిమాండ్ తగ్గింది. అయితే బంగారం కొనుగోళ్లు మాత్రం ఈ పండుగ సీజన్లో ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 25వ తేదీన ధన్‌తెరాస్ ఉంది. ఈ సమయంలో బంగారం వంటి విలువైన వాటిపై పెట్టుబడులు పెట్టడం శుభంగా భావిస్తారు. ఈ శుభముహూర్తాన మీరు కూడా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ కింది విషయాలు గుర్తుంచుకోండి...

24 క్యారెట్లు సూట్ కాదు.. బంగారం స్వచ్ఛత తెలుసుకోండి..
బంగారం కొనుగోలు చేసే సమయంలో బంగారం స్వచ్ఛత గురించి తెలుసుకోవాలి. హాల్‌మార్క్ జ్యువెల్లరీలో బీఐఎస్ మార్క్, ప్యూరిటీ, హాల్‌మార్క్ సెంటర్ ఐడెంటిటీ నెంబర్, జ్యువెల్లరీ ఐడెంటిఫికేషన్ మార్క్ వంటి నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బంగారం యొక్క స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9 శాతం స్వచ్ఛత, 22 క్యారెట్ల బంగారం 92 శాతం స్వచ్ఛతగా ఉంటుంది. బంగారు ఆభరణాల స్వచ్ఛత చెక్ చేయకుండా కొనుగోలు చేయరాదు. ఆభరణాల తయారీకి 24 క్యారెట్ల బంగారం సూట్ కాదు. కాబట్టి జ్యువెల్లర్లు 14 క్యారెట్లు, 18 క్యారెట్లు లేదా 22 క్యారెట్లు ఉపయోగిస్తారు.

హల్ మార్క్ జ్యువెల్లరీ.. ఈ నాలుగు గుర్తుంచుకోండి..
హాల్ మార్కింగ్ అంశాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) చూసుకుంటుంది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో BIS పని చేస్తుంది. బంగారు ఆభరణాలకు మూడు గ్రేడ్‌లలో హాల్ మార్కింగ్ మార్గదర్శకాలు రూపొందించింది. 14 క్యారెట్లు, 18 క్యారెట్లు, 22 క్యారెట్లు ఉండాలి. బంగారం స్వచ్ఛత ధృవీకరించే ప్రక్రియనే హాల్ మార్కింగ్. స్వచ్ఛత నిర్ధారించుకునేందుకు BIS మార్క్, క్యారెట్లలో ప్యూరిటీ, హాల్ మార్క్ సెంటర్ ఐడెంటిటీ నెంబర్/మార్క్, జ్యువెల్లరీ ఐడెంటిఫికేషన్ మార్క్/నెంబర్.. అనే నాలుగు అంశాలను గుర్తుంచుకోవాలి.

ధరలు తెలుసుకోవాలి
బంగారం ధరలను ఎప్పటికి అప్పుడు తెలుసుకోవాలి. మార్కెట్ రేటు ఆధారంగా బంగారం ధర ఎప్పటికి అప్పుడు మారుతుంది. అన్ని బంగారం దుకాణాలు కూడా తమ షాపులలో ధరలను ప్రదర్శిస్తాయి. మీరు తొలుత బులియన్ ధరలు పరిశీలించి, ప్యూరిటీ ఆధారంగా డిస్కౌంట్ చెక్ చూసుకోవాలి. ఉదాహరణకు 10 గ్రాముల బంగారం ధర రూ.38,500 అయితే 22 క్యారెట్ల (91.6 శాతం) బంగారం ధర 35,260 ఉంటుంది.

మేకింగ్ ఛార్జీలు..
బంగారం నుంచి ఆభరణాన్ని తయారు చేయడానికి మేకింగ్ ఛార్జీలు తీసుకుంటారు. మేకింగ్ ఛార్జీలు డిజైన్ ఆధారంగా ఉంటాయి. యంత్రంతో లేదా చేతితో తయారు చేస్తారు. మ్యాన్యువల్‌గా చేసిన ఆభరణాల కంటే యంత్రంతో చేసిన ఆభరణాలకు మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కానీ మ్యాన్యువల్‌గా చేసినవే ఎక్కువ నాణ్యత కలిగి ఉంటాయి. మేకింగ్ ఛార్జీలను గ్రాము ప్రాతిపదికన వసూలు చేస్తారు.

ఆభరణాలలో విలువైన రాళ్లు
భారత్‌లో విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలకు డిమాండ్ ఎక్కువ. డైమండ్ వంటి విలువైన రాళ్లను ఆభరణాలలో కలుపుతారు. దీంతో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారంతో పాటు వాటికి కూడా మీరు డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. విలువైన రాళ్లతో కూడిన బంగారాన్ని కలిపి మీరు కొనుగోలు చేస్తారు. కానీ తిరిగి విక్రయించే సమయంలో వాటిని పక్కన పెట్టి తీసుకుంటారు. కాబట్టి విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు ఇది గుర్తుంచుకోండి.


Click it and Unblock the Notifications