రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును అరశాతం తగ్గించడంతో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. దీంతో డిపాజిట్లపై వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో మదుపుదారులు తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
దీంతో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉన్న వారు షేర్ల కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగా డీమ్యాట్ ఖాతాలు తెరిచే పనిలో పడుతున్నారు. అయితే తొలిసారి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను ప్రయోజనం పొందే లాభం కూడా ఉంది.
స్టాక్ మార్కెట్ ద్వారా షేర్లను కొనుగోలు చేయాలనుకునే వారు రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీం (ఆర్‌జీఈఎస్‌ఎస్) ద్వారా వారు పన్ను లాభాలను కూడా అందుకోవచ్చు. ఇక ఆర్‌జీఈఎస్‌ఎస్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో దేశీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి గత యూపీఏ ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్‌ను (ఆర్‌జీఈఎస్‌ఎస్) ప్రవేశపెట్టింది.

ఆర్‌జీఈఎస్‌ఎస్ ముఖ్య ఉద్దేశం
తొలిసారిగా ఈక్విటీ పథకాల్లో పెట్టుబడి చేసేవారికి పన్ను ప్రయోజనం కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టంలో సెక్షన్ 80 సీసీజీనీ ప్రత్యేకంగా చేర్చారు. అంటే ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల పన్ను ప్రయోజనానికి అదనం. ఈ పథకం కింద ఎంపిక చేసిన షేర్లు, లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం ద్వారా ఈ పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. ఇలా గరిష్టంగా రూ.50,000 వరకు పెట్టుబడి చేయవచ్చు.

నిబంధనలు ఏమిటి?
ఇంతవరకు స్టాక్ మార్కెట్ లావాదేవీలూ నిర్వహించని వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అదే విధంగా మదుపుదారు తన పేరు మీద డీమ్యాట్ ఖాతా ఉండాలి. గతంలో ఎప్పుడైనా డీమ్యాట్ అకౌంట్ తెరిస్తే, అందులో ఇప్పటి వరకు ఎటువంటి లావాదేవీలు జరపకుండా ఉండాలి. మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, షేర్లను కేవలం డీమ్యాట్ అకౌంట్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

లాకింగ్ పిరియడ్ ఉందా?
ఆర్‌జీఈఎస్‌ఎస్ పథకం కింద కొనుగోలు చేసిన షేర్లను మూడేళ్ల పాటు విక్రయించకూడదు. మూడేళ్ల కాలాన్ని లాకింగ్ పీరియడ్‌గా పరిగణిస్తారు. అయితే పెట్టుబడి చేసిన ఏడాది తర్వాత నుంచి ఈ లాకింగ్ పిరియడ్‌లో కొంత వెసులుబాటు కల్పించారు. రెండో ఏడాది నుంచి పన్ను మినహాయింపు పొందిన విలువకు సమాన మొత్తంలో షేర్లను ఉంచి, మిగిలిన యూనిట్లు లేదా షేర్లను విక్రయించవచ్చు.

ఎలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టాలి?
మీకు నచ్చిన కంపెనీ షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే పన్ను ప్రయోజనాలు లభించవు. తొలిసారి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేస్తున్నారు కాబట్టి రిస్క్ తక్కువగా ఉండే అతిపెద్ద కంపెనీల షేర్లు కొంటేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. వీటికి సంబంధించి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కేవలం బీఎస్‌ఈ 100 , ఎన్‌ఎస్‌ఈ 100 ఇండెక్స్‌లో ఉన్న కంపెనీ షేర్లు లేదా ఈటీఎఫ్‌లు, ఆర్‌జీఈఎస్‌ఎస్ పరిధిలోకి వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తేనే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వరంగ మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీల షేర్లు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications