మనిషి జీవితంలో అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తాయో చెప్పడం కష్టం. కాబట్టి అన్ని పరిస్ధితుల్లో ముందు నుంచీ ఎంత సిద్ధంగా ఉన్నా, అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి. ముఖ్యంగా ఆర్ధికంగా అత్యవసరం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా దాన్ని ఎదుర్కోవడానికి మనం సరైన ప్రణాళికలు వేసుకోవాలి?
ఏమిటీ అత్యవసర నిధి?
అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నగదుని ఏర్పాటు చేసుకోవడాన్నే అత్యవసర నిధి. ఈ అత్యవసర నిధి కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపడా ఉండాలి. అసలు అత్యవసర నిధి అవసరమా? అంటే అవుననే చెప్పాలి.
హఠాత్తుగా ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగం చేయలేని పరిస్థితి తలెత్తడం, వైద్య బీమా పరిధిలోని చికిత్సల ఖర్చు తదితర అనేక కారణాలతో మనకు డబ్బు అవసరం ఏర్పడుతుంది. అప్పటికప్పుడు వీటిని ఎదుర్కొని నిలబడాలంటే అత్యవసర నిధి కావాల్సిందే.

అత్యవసర నిధిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి?
అత్యవసర నిధి ఏర్పాటు చేసుకునేప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం అవసరానికి చేతికి డబ్బు అందాలి. లేదా కనీసం ఒకటి రెండు రోజుల్లో అయినా నగదు అందేలా చూసుకోవాలి. మీ కుటుంబ అవసరాలకు కనీసం మూడు నుంచి ఆరు నెలలకు సరిపడా నిధి ఉండాలి.

మూడు నుంచి ఆరునెలల ఖర్చులే ఎందుకు?
ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఆర్ధిక విషయాల్లో ఎంత అవసరం ఉన్నా, మూడు నెలల్లో దాని నుంచి బయటపడేందుకు మార్గాలు కనిపిస్తాయి. ఒకవేళ అలా కాని పక్షంలో ఆరు నెలలు. ఈ సమయంలో మీ కుటుంబం గడిచేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే కనీసం మూడు నెలల నుంచి గరిష్ఠంగా ఆరు నెలల వరకూ ఖర్చులను నిధిగా ఉంచుకోవాలి.

జమ చేయడం ఎలా?
ముందుగా మీ నెలవారీ ఖర్చులకు ఎంత మొత్తం కావాలన్నది రాసి పెట్టుకోండి. ఇందులో నిత్యావసర ఖర్చులు, విద్యుత్, నీటి బిల్లులు, పిల్లల ఫీజులు, మీ వైద్య ఖర్చులు, రుణ వాయిదాలు తదితరాలన్నీ కలిసి ఉండాలి. ఇదే మీ లక్ష్యిత అత్యవసర నిధి. మీ ఆదాయాన్ని బట్టి, మీరు నెలకు ఎంత చొప్పున అత్యవసర నిధికి కేటాయిస్తారన్నది నిర్ణయించుకోండి.అత్యవసర నిధికోసం కేటాయిస్తున్న మొత్తాన్ని ప్రత్యేక పొదుపు ఖాతాలోకి మళ్లించండి.

ఎక్కడ మదుపు చేస్తే ప్రయోజనం?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పనితీరును బట్టి వీటి రాబడి ఆధారపడి ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. ఇందులో లిక్విడ్ ఫండ్లు, షార్ట్ టర్మ్ ఫండ్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల్లో పొదుపు ఖాతాలో వార్షిక వడ్డీ 4శాతం వరకూ అందుతుంది.


Click it and Unblock the Notifications