గతంలో ఎవరి ఖాతాలోనైనా సొమ్ము జమ చేయాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్ధితి. కానీ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అన్నీ జరిగిపోతున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో మీ ఖాతా నుంచి వేరే ఖాతాకి నగదు బదిలీ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.
ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేయాలంటే తొలుత లబ్ధిదారు ఖాతాను జత చేసుకోవాలి. మీరు నగదు పంపే వ్యక్తి పేరు, ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లాంటివి రిజిస్టర్ చేస్తే, అకౌంట్‌ను పరిశీలించి ఆ ఖాతాను మీ ఖాతాకు అనుసంధానం చేస్తుంది.
ఒక్కసారి మీరు అనుసంధానం చేసుకున్న ఖాతాకు ఎప్పుడైనా నగదు బదిలీ చేయవచ్చు. నగదు బదిలీల్లో పొరపాట్లు జరగకుండా నిరోధించేందుకు బ్యాంకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. అయినా సరే అనుకొకుండా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి.
సాధారణంగా నగదు బదిలీ విషయంలో ఎలాంటి పొరపాట్లు దొర్లుతాయో, అలాంటి సందర్భంలో మనం ఏమి చేయాలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్ నగదు బదిలీలో అకౌంట్ నెంబర్‌దే కీలక పాత్ర:
ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది. నెఫ్ట్, ఆర్‌టిజిఎస్ ద్వారా ఎప్పుడు నగదు బదిలీ చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎవరికైతే సొమ్ము పంపుతున్నామో ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా, బ్యాంకు శాఖ, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అన్నీ నమోదు చేయాలి.
ఖాతాను నమోదు చేసేటప్పుడు ఖాతా నెంబర్‌ను రెండు సార్లు అడుగుతుంది గనుక ఏ ఒక్క అంకె తప్పు కొట్టినా ఆటోమేటిక్‌గా బ్యాంకు, ఖాతాను తిరస్కరిస్తుంది. మీరు నమోదు చేసిన అకౌంట్ నెంబర్ కరెక్ట్ అయితే వినియోగదారుడికి మొబైల్‌కు బ్యాంకు ఒక ఎస్‌ఎంఎస్ పంపుతుంది. ఆ ఎస్‌ఎంఎస్‌లో బ్యాంకు ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్ నమోదు చేసిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తి పేరు మీ ఖాతాకు జమ అవుతుంది.
నగదు బదిలీలో చాలా జాగ్రత్త వహించాలి:
మీరు బదిలీ చేయాల్సిన నగదుకి ఒక సున్నా అదనంగా చేర్చినా వెయ్యి రూపాయల బదిలీ కావాల్సిన స్ధానంలో పది వేలు బదిలీ అవుతాయి. కాబట్టి మీరు ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇలాంటి సందర్భంలో తప్పు గనుక దొర్లితే మీ లావాదేవీని గంట వ్యవధిలోపు రద్దు చేసుకునే వెసులుబాటుని బ్యాంకును కోరవచ్చు. ఆ గంట వ్యవధి కూడా దాటిపోతే మాత్రం వెంటనే ఆ విషయాన్ని బ్యాంకుకి తెలియజేయండి.
పూర్తి బాధ్యత నగదు బదిలీ చేసిన వారిదే:
మీరు నగదు బదిలీ చేసిన తరుణంలో పంపాల్సిన దాని కంటే ఎక్కువ నగదు బదిలీ చేసినట్లైతే, ఆ సమాచారాన్ని మీ బ్యాంకు ఎదుటి బ్యాంకుకు తెలియచేసి కస్టమర్ ఖాతా నుంచి అదనంగా జమ అయిన సొమ్ము వాపసు పంపాలని కోరుతుంది.
ఆ బ్యాంకు తమ ఖాతాదారునికి ఆ విషయం తెలియచేసి సొమ్ము వాపస్ చేసేందుకు అనుమతి అడుగుతుంది. అందుకు ఆ వ్యక్తి అనుమతిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందుకు అంగీకరించక పోతే మాత్రం కోర్టు ద్వారా మాత్రమే ఆ నగదుని రాబట్టుకునేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications