జీతం పెరిగింది: సరైన ప్రణాళికను వేసుకున్నారా?
న్యూఢిల్లీ: మార్చి వచ్చిందంటే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు జీతం పెంచేస్తుంటాయి. అలా వచ్చే డబ్బును ఖర్చు చేసేందుకు సరైన ప్రణాళికను వేసుకున్నారా? జీతం పెంపు ద్వారా వచ్చిన డబ్బుని ఎలా పడితే అలా ఖర్చు పెట్టుకుండా సరైన అవసరాల కోసం ఖర్చు చేయాలి.
ఇల్లు కొనేందుకు ఉపయోగించండి:
భవిష్యత్తులో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఐతే ఇప్పటి నుంచే మన జీతంలో కొంత సొమ్ముని పక్కకు పెట్టుకోవాలి. అందుకోసం జీతం పెంపుని దాచుకోవచ్చు. దీని కోసం మీరు చేయాల్సిందల్లా డెట్ ఫండ్లలో లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఈ డబ్బును పెట్టేయండి. దీనివల్ల మీరు ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు మార్జిన్ మనీ కోసం ఎదుటి వారిని అడగాల్సిన అవసరం ఉండదు.
బీమా పాలసీకి ప్రీమియంగా చెల్లించండి:
మీరు రెండేళ్ల క్రితం బీమా తీసుకున్నారా? అప్పటికీ, ఇప్పటికీ అవసరాలు, బాధ్యతల్లో ఎంతో తేడా వస్తుంది. కాబట్టి ఒకసారి మీ బీమా పాలసీని సమీక్షించుకోండి. తక్కువ మొత్తంలో ఉంటే, టర్మ్ పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించండి.

బంగారం కొనండి:
బంగారం కొనడం కూడా మంచిదే. ఖచ్చితంగా అవసరం అయితే నగల రూపంలో కొనుగోలు చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం బంగారం రూపంలో మదుపు చేయాలనుకుంటే బంగారు ఫండ్లను లేదా గోల్డ్ ఈక్విటీలను కొనుగోలు చేయండి.
అప్పు లేకుండా వాహనం కొనుగోలు చేయండి:
మీ వద్ద ఉన్న వాహనం పాతదైతే మార్చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయండి. ఎలాంటి అప్పు లేకండా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ డబ్బు సరిపోకపోయినా తక్కువ మొత్తం అప్పు తీసుకుంటే వెంటనే తీర్చేయవచ్చు.
అత్యవసర సమయాల్లో ఉపయోగించండి:
పరిస్ధితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఉద్యోగం పోవచ్చు లేదా ప్రమాదం జరిగి ఆదాయం ఆగిపోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం మూడు నెలల ఖర్చులకు సరిపడా డబ్బుని ఉపయోగించే విధంగా ఎల్లప్పుడూ ఉంచుకోవాలి.


Click it and Unblock the Notifications