Layoff News: దేశంలో అనేక స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పేటీఎం, ఫిప్‌కార్ట్ సంస్థలు తమ కంపెనీల్లో మూడో త్రైమాసిక సమయంలో ఉద్యోగులను తొలగించాయి.
ఇప్పుడు ఈ జాబితాలోకి టాటా-జొమాటోలు పెట్టుబడులు కలిగిన Cult.fit కంపెనీ కూడా వచ్చి చేరిపోయింది. కొనసాగుతున్న అనిశ్చిత వ్యాపార వాతావరణంలో ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2024 లేఆఫ్ జాబితాలో చేరిన కంపెనీ దేశ వ్యాప్తంగా దాదాపు 150 మంది ఉద్యోగులను తాజా రౌండ్‌లో తొలగించినట్లు వెల్లడించింది.

నెమ్మదిస్తున్న వ్యాపార వాతావరణంలో క్యాష్ బర్న్ వేగాన్ని తగ్గించుకునేందుకు కంపెనీకి తాజా లేఆఫ్స్ దోహదపడనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫిట్‌నెస్ యునికార్న్ Cult.fit మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగులను ఎక్కువగా తొలగించిందని సమాచారం. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలని, భవిష్యత్తు కోసం దాని ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటోతో పాటు టాటా డిజిటల్ ప్రధాన పెట్టుబడిదారులుగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ఫిట్‌నెస్ కంపెనీ రూ.15 కోట్ల క్యాష్ బర్న్ కలిగి ఉందని వెల్లడైంది. ఉద్యోగుల తొలగింపు ద్వారా దీనిని రూ.10 కోట్లకు తగ్గించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. వాస్తవానికి Cult.fit టెక్-ఎనేబుల్డ్ ఆన్‌లైన్ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రారంభమైనప్పటికీ.. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఆఫ్‌లైన్ జిమ్ చైన్‌గా రూపాంతరం చెందడానికి ఎక్కువ డబ్బును వెచ్చిస్తోంది. అలాగే కంపెనీ రాబోయే 12 నెలల్లో ప్రీ-ఐపీవో రౌండ్ ఫండింగ్‌కు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications