Zomato new service: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పలు కొత్త రకాల సర్వీసులను అందిస్తూ ప్రజల్లోకి చొచ్చుకు పోతోంది. కంపెనీ CEO దీపిందర్ గోయల్ కూడా బిజినెస్ విస్తరణ కోసం వివిధ రకాల ఆలోచనలు చేస్తుంటారు. అయితే ఆ సంస్థ తాజాగా ప్రవేశపెట్టిన ఓ సేవపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
'ప్యూర్ వెజ్ మోడ్' పేరిట ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో నిన్న కొత్త సర్వీసును ప్రారంభించింది. దీని కోసం ప్రత్యేకంగా 'ప్యూర్ వెజ్ ఫ్లీట్' అనే స్పెషల్ డెలివరీ సిబ్బందిని కూడా అలాట్ చేసినట్లు ప్రకటించింది. కంపెనీ సాధారణంగా వినియోగించే ఎరుపు రంగు స్థానంలో బ్యాగ్ మరియు డ్రెస్ కలర్‌ను గ్రీన్ కు మార్చింది.

జోమాటో CEO ప్రకటించిన ఈ 'ప్యూర్ వెజ్ మోడ్' సర్వీస్ స్వచ్ఛమైన శాకాహారుల కోసం ఉద్దేశించబడింది. దీని కింద ప్యూర్ వెజ్ రెస్టారెంట్లు మాత్రమే లిస్ట్ చేయబడతాయి. ఈ హోటల్స్ నుంచి ఆర్డర్ చేసినప్పుడు ప్యూర్ వెజ్ ఫ్లీట్ సిబ్బందే ఆర్డర్‌ను డెలివరీ చేస్తారు. ఈ సర్వీస్ ద్వారా మాంసాహారం కానీ వాటిని విక్రయించే రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ స్వీకరించబడవు. వీటికోసం ప్రత్యేకంగా గ్రీన్ బ్యాగ్స్‌లో డెలివరీ చేయాలని ప్లాన్ చేశారు.
ఈ కొత్త సర్వీసు శాకాహారుల అవసరాలను మరింత సమర్థవంతంగా తీర్చగలదని పలువురు ప్రశంసించారు. అయితే చాలా మంది మాత్రం ఇది అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా చర్యలను సామాజికంగా తిరోగమనంగా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీపిందర్ గోయల్ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ కొత్త సేవల వల్ల ఏదైనా ప్రతికూల పరిణామాలు తలెత్తితే వెంటనే ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు.
'కొత్త సేవను పరిచయం చేసినందుకు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. మాంసాహారులు సైతం ఇప్పుడు తమ పేరెంట్స్ జొమాటో వాడొచ్చని వ్యాఖ్యానించారు. యువత నుంచి మంచి ఆదరణ లభించింది. కేవలం ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్ అభివృద్ధి చేశాం. కుల,మతాలతో సంబంధం లేకుండా కొంతమంది మాంసాహారాన్ని ఇష్టపడరు' అని గోయల్ స్పష్టం చేశారు. అంతలోనే గ్రీన్ డ్రెస్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications