Zomato Shares: ఇటీవలి కాలంలో అనేక స్టార్టప్ కంపెనీలకు టాక్స్ అధికారుల నుంచి నోటీసులు వస్తున్నాయి. వందలు, వేల కోట్లలో టాక్స్ చెల్లించాలంటూ నోటీసులు రావటంపై సదరు కంపెనీలు షాక్‌కి గురవుతున్నాయి.
తాజాగా ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ స్టార్టప్ జొమాటో సైతం రూ.401.70 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు అందాయి. దీపేందర్ గోయల్ నడుపుతున్న స్టార్టప్ అక్టోబర్ 29, 2019 నుంచి మార్చి 31, 2022 మధ్య కాలానికి పెనాల్టీ, వడ్డీలతో కలిపి ఈ మెుత్తాన్ని చెల్లించాలని టాక్స్ అధికారుల నుంచి డిమాండ్ నోటీసులు రావటం సంచలనంగా మారింది. దీనిపై పన్ను అధికారులు వివరణ కోరారు.

వాస్తవానికి టాక్స్ అధికారులు క్లెయిమ్ చేస్తున్న మెుత్తం డెలివరీ ఛార్జీల రూపంలో వసూలు చేసినవే. దీనిపై జొమాటో బీఎస్ఈకి వివరణ పంపుతూ కంపెనీ డెలివరీ బాయ్స్ తరఫున ఆ మెుత్తాన్ని వసూలు చేస్తుందని.. దానిని నేరుగా సదరు డెలివరీ పార్ట్నర్ పొందినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇది కంపెనీకి వచ్చిన ఆదాయం లేదా లాభం కానందున తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని జొమాటో వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో డెలివరీ పార్ట్నర్ నేరుగా కస్టమర్లకు తన సేవలను అందించారని కంపెనీకి కాదని వివరించింది.
ప్రస్తుతం కేవలం పన్ను అధికారులు వివరణ మాత్రమే అడిగారు. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని కంపెనీ వెల్లడించింది. టాక్స్ అధికారుల నోటీసులకు సరైన సమాదానం తమవద్ద ఉందని, దీనివల్ల కంపెనీకి ఎలాంటి నష్టం ఉండబోదని వారు తెలిపారు. ఈ వార్తల నేపథ్యంలో జొమాటో షేర్లు నేడు స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం 10.31 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో స్టాక్ 2.64 శాతం నష్టపోయి రూ.123.75 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications