Zomato: మరో EV సంస్థతో జొమాటో భాగస్వామ్యం.. 100 శాతం గ్రీన్ డెలివరీలు లక్ష్యంగా అడుగులు
Zomato: ఫుడ్ డెలివరీ యాప్ గా జొమాటోకు మంచి క్రేజ్ ఉంది. డెలివరీ ఏజెంట్ల ఇబ్బందులను అర్థం చేసుకుని వారి కోసం పలు సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. ఇటీవల వారు విశ్రాంతి తీసుకునేందుకు గాను 'రెస్ట్ హౌస్'లు ఏర్పాటు చేసి మంచి మనసు చాటుకుంది. వాహనం కొనుగోలు, ఇంధనం ఖర్చుల విషయంలోనూ వారికి కొంతమేర సహాయపడేందుకు సిద్ధమైంది.
ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ-యాస్-ఎ-సర్వీస్ (MaaS) ప్లేయర్ Yulu ఓ ప్రకటన చేసింది. ఇంట్రా-సిటీ డెలివరీల కోసం Yulu DeX EVలను వినియోగించేందుకు Zomatoతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా, దాదాపు 35 వేల వాహనాలను కస్టమ్-మేడ్ రెంటల్ ప్లాన్‌లపై పొందేందుకు ఫుడ్ డెలివరీ సంస్థ ఓకే చెప్పినట్లు వెల్లడించింది.

ఆన్ బోర్డ్ అవుతున్న డెలివరీ భాగస్వాములకు పెరుగుతున్న ఇంధన ధరలు, ఆర్థిక సవాళ్లు ముఖ్యమైన అడ్డంకులుగా జొమాటో ప్రతినిధి ప్రదీప్ పురాణం పేర్కొన్నారు. తక్కువ-స్పీడ్ తో కూడిన Yulu DeX ఇ-స్కూటర్ ద్వారా ఈ సవాళ్లను ఎదుర్కోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. యులు వాహనాలు ఫ్లెక్సిబుల్ రెంటల్ ప్యాక్‌లను కలిగి ఉండటం వల్ల సాధారణ వాటితో పోలిస్తే డెలివరీ భాగస్వాములు అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు.
తాజాగా జరిగిన Yuluతో కలిపి జొమాటోకు ఇది మూడవ EV భాగస్వామ్యం కావడం విశేషం. ఇప్పటికే బ్యాటరీ-స్వాపింగ్ టెక్నాలజీ కోసం సన్ మొబిలిటీ మరియు గోగోరోతో అనుబంధాన్ని ఇటీవల ప్రకటించింది. అయితే 25 వేల డిఎక్స్ ఇ-వాహనాలను 2026 నాటికి అందుబాటులోకి తెస్తే, రోజుకు 3 లక్షల గ్రీన్ డెలివరీలు అందిచవచ్చని యులు ధీమా వ్యక్తం చేసింది.
'ది క్లైమేట్ గ్రూప్ EV100'లో భాగంగా.. జొమాటో డెలివరీ ఫ్లీట్‌ను 100 శాతం ఎలక్ట్రిక్ గా మార్చడానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ COO మోహిత్ సర్దానా తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి యులు మద్దతుతో సరైన మార్గంలో వెళ్తున్నందుకు సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 2023 నాటికి 4 వేల మందికి పైగా డెలివరీ భాగస్వాములు EVను వినియోగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications